వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్ - వ్యూహం సినిమా సెన్సార్‌ను రద్దు చేయాలని పిటిషన్
Published : Dec 22, 2023, 7:36 PM IST
|Updated : Dec 22, 2023, 10:32 PM IST
19:29 December 22
వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ఠ దెబ్బతింటోంది:లోకేశ్
Nara Lokesh Petition in Telangana High Court on Vyooham Movie: 'వ్యూహం' సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈనెల 26న తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది. ఈ మూవీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనకు ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని లోకేశ్ తెలిపారు. ఆర్జీవీ తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారన్న లోకేశ్, వ్యూహం సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని అన్నారు. ట్రైలర్‌లో మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం ఉందన్న లోకేశ్, చంద్రబాబును అప్రతిష్ఠ పాలుజేసేందుకే సినిమా తీశారని పేర్కొన్నారు.
వ్యూహం సినిమాతో జగన్‌కు లబ్ధి కలిగేలా చూస్తున్నారని, వాక్‌స్వాతంత్ర్యం పేరిట ఇష్టారీతిన సినిమా తీశారని విమర్శించారు. దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందున్న లోకేశ్, వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని మండిపడ్డారు. ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారని, లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వెనుక ఉండి వ్యూహం సినిమా తీయించారని లోకేశ్ ధ్వజమెత్తారు.
Hyderabad City Civil Court Interim Orders on Vyooham Movie: మరోవైపు వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆంక్షలు విధించింది. ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ వేదికల్లో విడుదల చేయొద్దని ఆదేశం జారీ చేసింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని లోకేశ్ పిటిషన్ వేశారు. చంద్రబాబు ఖ్యాతి దెబ్బతీసేలా సినిమా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యూహం సినిమాపై సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదే విధంగా రామదూత క్రియేషన్స్, దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అనంతరం పిటిషన్‌పై విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.