Nanded Hospital Deaths : మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో రోగుల మృత్యుఘోష కొనసాగుతోంది. గడిచిన ఎనిమిది రోజుల్లో ఈ హాస్పిటల్లో మరో 108 మరణాలు సంభవించాయి. బుధవారం 24 గంటల వ్యవధిలో 11 మంది రోగులు మరణించారు. వీరిలో ఓ పసికందు కూడా ఉంది. ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మరణించడం తీవ్ర దుమారం రేపింది.
వరుస మరణాలపై ఆసుపత్రి డీన్ మరోసారి స్పందించారు. తమ ఆస్పత్రిలో సరిపడా ఔషధ నిల్వలు ఉన్నాయని.. మూడు నెలలకు సరిపడా ఔషధాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అన్నివేళలా రోగులకు సిబ్బంది చికిత్స అందిస్తున్నారని.. ఔషధాల కొరత కారణంగా ఏ రోగి ప్రాణాలు కోల్పోవట్లేదని స్పష్టం చేశారు. వారు ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లనే చనిపోతున్నారని తెలిపారు. ఇక చిన్నారుల్లో కొంతమందికి పుట్టుకతో వచ్చిన ఆరోగ్య సమస్యలున్నాయన్నారు.
ఈ ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. మరోవైపు జాతీయ మానవహక్కుల కమిషన్- ఎన్హెచ్ఆర్సీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అంతకుముందు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు అక్టోబర్ 3న ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు మహారాష్ట్ర వైద్యవిద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మహైశేఖర్.