Nandamuri Balakrishna Comments on Yuvagalam Vijayotsava Sabha:కనకపు సింహాసనంపై శునకంలా సైకో పాలన సాగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ (TDP Leader Nandamuri Balakrishna) ధ్వజమెత్తారు. యువగళం విజయోత్సవ సభకు (Yuvagalam Vijayotsava Sabha) హాజరైన బాలకృష్ణ సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవశకం అంతం కాదిది ఆరంభమని తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వంపై పోరాటానికి సమయం లేదు - విజయమో వీర స్వర్గమో ఇక తేల్చుకోవాల్సిందేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. లోకేశ్ యువగళం ప్రజాగళంగా కదం తొక్కిందని తెలిపారు. లోకేశ్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై జనసేన అధినేత పోరాడుతున్నారని స్పష్టం చేశారు.
యువగళం-నవశకం - భారీగా తరలి వచ్చిన ప్రజలు - డ్రోన్ దృశ్యాలు
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చారని బాలకృష్ణ (Balakrishna Comments on CM Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని విమర్శించారు. ల్యాండ్, శాండ్ స్కాములతో కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమాలను అణచివేస్తున్నారని, రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదన్నారు.