TSPSC Paper Leakage: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 'ఈడీ'కి చుక్కెదురు - పేపర్ లీకేజీ కేసులో ఈడీకి చుక్కెదురు
10:31 May 10
TSPSC Paper Leakage : పేపర్ లీకేజీ కేసులో ఈడీ వేసిన పిటిషన్ కొట్టివేత
TSPSC Paper Leakage Case Latest Update : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఈడీకి చుక్కెదురైంది. నిందితులను కస్టడీకి కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. రేణుక, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్‌లను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐదుగురు నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటామని, దీనికి అనుమతించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పిటిషన్లో కోరారు.
ఈడీ అధికారులు వేసిన పిటిషన్‌కు సిట్ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి 12వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది. కస్టడీ పిటిషన్‌పై ఈడీ అధికారులు ఎంఎస్జే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్‌గూడ జైల్లో ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితారాంచంద్రన్తో పాటు సహాయ కార్యదర్శి సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: