Namo Bharat Train :దేశంలో సరికొత్త హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్' పేరుతో ప్రాంతీయ రైళ్లను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైళ్లకు 'నమో భారత్'గా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసినట్లు తెలుస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తర్వాత భారత్‌లో పట్టాలెక్కుతున్న మరో హైస్పీడ్ రైలు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (అక్టోబర్ 20న) ప్రారంభించనున్నారు. దిల్లీ నుంచి గాజియాబాద్ మధ్య ఈ రైలు నడవనుంది. సాహిబాబాద్- దుహై డిపో మధ్య ఈ రైలు దూసుకెళ్లనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో అధునాతన వసతులు ఏర్పాటు చేశారు.
కాగా, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో భాగంగా దిల్లీ- గాజియాబాద్ - మేరఠ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీంతో సాహిబాబాద్, దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల పొడవైన కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ రెండు డిపోల మధ్య ఐదు స్టేషన్లు (సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దర్, దుహై, దుహై డిపో) ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు సర్వీసులు అందిస్తాయి.
15 నిమిషాలకో రైలు..
నమో భారత్ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్. ఇరువైపులా 2x2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్‌లు ఉంటాయి. సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ మెకానిజం, ఛార్జింగ్ పాయింట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు నడుస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున సర్వీసులు అందిస్తాయి.