'నమో భారత్'కు మోదీ పచ్చజెండా Namo Bharat Train Launch : వందే భారత్ రైళ్ల తరహాలో దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ర్యాపిడ్ ఎక్స్ సెమీ-హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కాయి. సాహిబాబాద్, దూహై డిపో మధ్య 17 కిలోమీటర్ల కారిడార్‌లో ప్రయాణించే రైలును పచ్చా జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోనే తొలి ర్యాపిడ్ రైల్ సర్వీస్‌ను ప్రారంభించడం చారిత్రక ఘట్టమని మోదీ తెలిపారు. తొలి నమో భారత్ రైలును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగమిస్తుందని తాను దృఢంగా నమ్ముతానని చెప్పారు మోదీ. వచ్చే 18 నెలల్లో దిల్లీ-మేరఠ్ సర్వీసు పూర్తవుతోందని.. అప్పుడు కూడా తాను ప్రజల మధ్యలోనే ఉంటానంటూ.. పరోక్షంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నమో భారత్ రైళ్లను దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రకటించారు. అంతకుముందు బెంగళూరు మెట్రోలోని తూర్పు-పశ్చిమ కారిడార్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బైయప్పనహల్లి నుంచి కృష్ణార్జునపుర, కెంగేరి నుంచి చల్లఘట్ట మార్గాలను జాతికి అంకింతం చేశారు. ఈ మార్గాల్లో అక్టోబర్ 9నే ప్రయాణాలు మొదలైనా.. అధికారికంగా తాజాగా ప్రారంభించారు.
"నా చిన్నతనంలో ఎక్కువ సమయం రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైనే గడిపాను. ఇప్పుడు కొత్త తరహా రైళ్లను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఎంతో పవిత్రమైన దేవి నవరాత్రుల్లో.. తొలి నమో భారత్ రైలు ప్రారంభవడం సంతోషం. ఈ రైలులో డ్రైవర్ నుంచి సిబ్బంది వరకు అందరూ మహిళలే. భారత్‌లో మహిళా సాధికారత పెరుగుతోంది అనడానికి ఇది నిదర్శనం. 21శతాబ్దంలో భారత్ ప్రతి రంగంలోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాం."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
అంతకుముందు నమో రైల్లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. పాఠశాల విద్యార్థులు, రైలు సిబ్బందితో ముచ్చటించారు. మోదీతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైల్లో.. అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, 2 ఇన్‌టూ 2 లేఅవుట్‌లో సీట్లు నిలబడేందుకు విశాలమైన ప్రదేశం ఈ రైళ్లలో ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమో భారత్ రైళ్లు ఉదయం ఆరు నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు సేవలందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. నిల్చొని ప్రయాణించేవారితో కలిపి ఏకకాలంలో 1,700 మంది వీటిలో వెళ్లవచ్చు. ప్రామాణిక కోచ్‌లలో టికెట్ ధర రూ.20-50 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40-100 మధ్య ఉంటుంది. ప్రతి రైలులో ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు.
దిల్లీ- గాజియాబాద్- మేరఠ్ మధ్య రూ.30,000 కోట్లతో చేపట్టిన రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS) నడవాలో సాహిబాబాద్-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి. ఆర్‌ఆర్‌టీఎస్ నడవాలోని స్టేషన్లలో ప్రయాణికుల సమాన్లను స్కాన్ చేసేందుకు కృత్రిమ మేథ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. లగేజీని స్కానర్ ద్వారా పంపుతున్నప్పుడు అన్ని కోణాల్లో అది కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది. నిషిద్ధ వస్తువులు ఉంటే ఇది భద్రతాసిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. తనిఖీలు వేగంగా, సమర్థంగా జరిగేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Namo Bharat Train : దేశంలో సరికొత్త హైస్పీడ్ రైళ్లు.. వందేభారత్‌ను మించేలా 'నమో భారత్!'.. టికెట్ 20 రూపాయలే!
Trains To President Of India Murmu Own District : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలానికి తొలి రైలు.. ఎప్పటి నుంచో తెలుసా?