తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కునో పార్క్ నుంచి పారిపోయిన నమీబియా చీతా! ఆందోళనలో స్థానికులు!! - భారతదేశంలోని చీతాలు లేటెస్ట్ న్యూస్​

నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన 8 చీతాల్లో ఒక చీతా.. కూనో నేషనల్‌ పార్క్‌ నుంచి తప్పించుకుంది. ఒబాన్‌ అనే చీతా కూనో పార్కు నుంచి దూరంగా వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దాని మెడలోని కోలార్‌ డివైజ్‌ ద్వారా ఎప్పటికప్పుడు చీతా జాడల్ని గుర్తిస్తున్నారు.

Namibian Cheetah Oban
Namibian Cheetah Oban

By

Published : Apr 2, 2023, 9:07 PM IST

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్‌ జాతి చీతాల్లో ఒకటి నిర్దేశిత ప్రాంతం నుంచి తప్పించుకుంది. ఒబాన్‌ అనే చీతా కూనో నేషనల్‌ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలోని బరోడా గ్రామంలో కనిపించింది. అక్కడి పొలాల్లో చీతా నక్కినట్లు స్థానికులు గుర్తించారు. ఇటీవలే ఆ చీతాను కూనో నేషనల్‌ పార్కు నుంచి ఫ్రీ ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టారు. చీతా జాడ కనిపించకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చీతా కదలికలను దాని మెడలో ఉంచిన కోలార్‌ పరికరం నుంచి గుర్తిస్తున్నారు. అది వెళుతున్న ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి దూరంగా ఉంచుతున్నారు. దాన్ని తిరిగి కూనో పార్కుకు తీసుకెళ్లేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో.. ఇప్పటి వరకు నాలుగింటిని కూనో నేషనల్‌ పార్కు నుంచి ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టారు. ఒబాన్‌, ఆశాలను మార్చి 11న విడిచి పెట్టగా.. ఎల్టల్‌, ఫ్రెడ్డీలను మార్చి 22న విడిచిపెట్టారు. కాగా ఒబాన్​ అడవి నుంచి తప్పిపోయి.. జనావాసాల్లోకి చొరబడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కునో పార్క్ నుంచి బయటకు వెళ్లిన నమీబియా చీతా ఒబాన్​

దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు..
ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌నకు తీసుకువచ్చారు. వాటిలో ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నుంచి గ్వాలియర్ ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌కు భారత వాయుసేన విమానంలో తీసుకొచ్చారు. దాదాపు పది గంటల ప్రయాణం తర్వాత చీతాలు దక్షిణాఫ్రికా నుంచి భారత్ చేరుకున్నాయి. ఆ తర్వాత వాయుసేన హెలికాప్టర్‌లలో కునో జాతీయ పార్క్‌నకు వాటిని తరలించారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్‌ కునో జాతీయపార్కులో సిద్ధంచేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలోకి చీతాలను విడిచిపెట్టారు.

7 దశాబ్దాల తర్వాత మొదటిసారి!
భారత గడ్డపై 70 ఏళ్ల తర్వాత ఇటీవలే చీతాలు మళ్లీ జన్మించాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒక దానికి నాలుగు పిల్లలు జన్మించాయి. ఈ విషయాన్ని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్‌లో తెలిపారు. దీంతో పాటుగా ఆ చీతాకు సంబంధించి వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. చీతా నాలుగు పిల్లలకు జన్మనివ్వడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాల్లో ఒకటి ఇటీవలే కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా మరణించింది.

భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువైన చీతాలు.. 74ఏళ్ల క్రితమే భారత్‌లో అంతరించిపోయాయి. 1947 సంవత్సరంలో దేశంలో చివరిగా మిగిలిన చీతా ఛత్తీస్‌గడ్‌లో చనిపోగా.. 1952లో చీతాలు అంతరించిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతరించిపోయిన చీతాలను తిరిగి దేశంలో పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తొలివిడతగా గతేడాది 2022 సెప్టెంబరులో నమీబియా నుంచి 8 చీతాలను భారత్ తీసుకువచ్చారు.

ABOUT THE AUTHOR

...view details