పార్లమెంటు సభ్యులు ప్రజల పక్షాన నిలబడాలని రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ప్రారంభం కాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కొవిడ్ కారణంగా నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను పరిష్కరించే దిశగా చర్చలు జరపాలని సూచించారు. శనివారం సాయంత్రం తన నివాసంలో జరిగిన రాజ్యసభాపక్ష నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
29 బిల్లులు..
ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాల ఎజెండా గురించి వివరించారు. 6 ఆర్డినెన్స్‌లతో సహా 29 బిల్లులను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రెండు అంశాలు కూడా సభ ముందుకొస్తున్నట్లు వెల్లడించారు.
ఆ అంశాలపై చర్చ..
రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే.. సభలో చర్చకోసం విస్తృత అంశాలను ప్రతిపాదించారు. దేశంపై కొవిడ్ ప్రభావం, దానివల్ల ఆర్థిక, ఉపాధి, పేదలపై పడ్డ భారం, మూడో ఉద్ధృతిపై ప్రభుత్వ పరమైన సన్నద్ధత, రైతు ఉద్యమం, సహకార పూర్వక సమాఖ్య వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా చర్యలు, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి.. లాంటి అంశాలను చర్చించాలని కోరారు.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ.. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అమెరికా బలగాల ఉపసంహరణ, దాని ప్రభావాలపై చర్చించాలని కోరారు. ఈ సమావేశంలో 20 పార్టీ నాయకులు పాల్గొని విభిన్న అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.
రాజ్యసభాపక్షనేతగా కొత్తగా ఎంపికైన పీయూష్ గోయల్‌ను వెంకయ్యనాయుడు అభినందించారు. నిర్మలా సీతారామన్ సహా పలువులు కేంద్రమంత్రులు శనివారం.. ఉపరాష్ట్రపతిని కలిశారు.
ఇదీ చదవండి :19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు