శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సమీక్ష నిర్వహించారు. రాజ్యసభ ప్రధాన కార్యదర్శితో పాటు, సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. ఉభయ సభలలో సీటింగ్ నిర్వహణ, సభ్యుల మధ్య ఆరు గజాల దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లపై చర్చించారు.
రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య సమీక్ష - Naidu reviews arrangements for Budget Session of Parliament
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సమీక్ష నిర్వహించారు. కరోనా నిబంధనలు తప్పక అమలు చేయాలని సూచించారు. ఎంపీల వ్యక్తిగత సిబ్బందికి సైతం కొవిడ్ పరీక్ష తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.

కరోనా నివారణకు పార్లమెంట్లో తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు వెంకయ్య. కొవిడ్ మార్గదర్శకాలు తప్పక పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లోని ఉద్యోగులు, అధికారులతో పాటు మంత్రులు, ఎంపీల వ్యక్తిగత సిబ్బందికి సైతం కొవిడ్ పరీక్ష తప్పనిసరి చేయాలని సూచించారు.
సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెంకయ్యకు వివరించారు. మార్గదర్శకాలను వివిధ మంత్రిత్వ శాఖలకు పంపించినట్లు చెప్పారు. ఎంపీల పరీక్షల కోసం ఆర్టీ-పీసీఆర్ విధానానికే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాల సీఎస్‌లకు సూచించినట్లు స్పష్టం చేశారు.