తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాటిని మాతృభాషల్లో బోధించే రోజులు రావాలి' - మాతృభాషలో ఇంజినీరింగ్ కోర్సులు

ప్రాంతీయభాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహించడం.. విద్యార్థుల పాలిట వరంగా మారుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మాతృభాషల్లో చదువు నేర్చుకోవడంవల్ల విద్యార్థులకు సంగ్రహణ, అవగాహన శక్తి పెరుగుతుందని చెప్పారు.

venkaiah naidu
వెంకయ్యనాయుడు

By

Published : Jul 22, 2021, 8:48 AM IST

ఇంజినీరింగ్‌, వైద్య, న్యాయశాస్త్రాలను మాతృభాషల్లో బోధించే రోజులు రావాలన్నదే తన కల అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృభాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రారంభించిన 8 రాష్ట్రాల్లోని 14 కాలేజీలకు ఆయన అభినందనలు తెలిపారు. వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులు నిర్వహించే మరిన్ని కళాశాలలు ఈ దిశలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయభాషల్లో ఇలాంటి కోర్సులు నిర్వహించడం విద్యార్థుల పాలిట వరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 'మాతృభాషలో ఇంజనీరింగ్‌ కోర్సులు.. సరైన దిశలో ఒక ముందడుగు' అన్న పేరుతో ఆయన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తన అభిప్రాయాలను తెలుగుతోపాటు 11 భారతీయ భాషల్లో పంచుకున్నారు.

"మాతృభాషల్లో చదువు నేర్చుకోవడంవల్ల విద్యార్థులకు చాలా లాభాలుంటాయి. పిల్లల సంగ్రహణ, అవగాహన శక్తి పెరుగుతుంది. ఇతర భాషా మాధ్యమాల్లో చదివే విద్యార్థులు తొలుత విషయాన్ని అర్థం చేసుకోవడంతోపాటు, మళ్లీ ఆ భాషలో ప్రావీణ్యం సాధించాల్సి ఉంటుంది. అందుకు చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మాతృభాషలో చదివే విద్యార్థులకు ఆ కష్టాలు ఉండవు"

-వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి

ప్రాచీన భారతీయ విజ్ఞాన వ్యవస్థల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచెప్పాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి పిలుపిచ్చారు. 'వేదాలు, ఉపనిషత్తులు లాంటి గొప్ప చరిత్రతో మనం మళ్లీ విజ్ఞాన రాజధానిగా, విశ్వగురువుగా ఎదగాలి' అని పేర్కొన్నారు. బుధవారం వీడియో ద్వారా జరిగిన ప్రపంచ విశ్వ విద్యాలయాల సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఇదీ చూడండి:JUSTICE NV RAMANA: మాతృభాష అనేది జాతి ఔన్నత్యానికి ప్రతీక: సీజేఐ ఎన్.వి రమణ

ఇదీ చూడండి:ప్రాంతీయ భాషల్లో బోధనతోనే నాణ్యమైన విద్య

ఇదీ చూడండి:అమ్మభాషే భవితకు సోపానం

ABOUT THE AUTHOR

...view details