అతివాదంతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకబోదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సంయమనం పాటించినప్పుడే సరైన పరిష్కార మార్గాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతర్లీనంగా ఈ సూత్రం దాగుందన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమానికి తెరదించే దిశగా ప్రభుత్వం, రైతులు చర్చలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ తొలి విడత సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఈ దఫా సమావేశాల తొలి దశలో రాజ్యసభ దాదాపు 100శాతం ఉత్పాదకత సాధించిందంటూ ఉపరాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు ఇతర సభ్యుల వీడ్కోలు సందర్భంగా అధికార, విపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించడం శుభ పరిణామమని పేర్కొన్నారు.