Nagpur on High alert: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జమ్ముకశ్మీర్‌కు చెందిన కొంతమంది యువత రెక్కీ నిర్వహించారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ ధ్రువీకరించారు. రెక్కీ నిర్వహించిన వారికి పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.
కేంద్ర భద్రతా సంస్థల నుంచి సమాచారం అందుకున్న నాగ్‌పుర్ పోలీసులు.. నగరంలోని కీలక ప్రాంతాలైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, రేషిమ్ బాగ్‌లోని సంఘ్ డాక్టర్ హెడ్గేవార్ స్మారక ప్రాంగణాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. భద్రతను మరింత పెంచినట్లు పేర్కొన్నారు. రెక్కీ ఎక్కడ నిర్వహించారు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.