తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Nagpur Floods Today : నాగ్​పుర్​లో భారీ వర్షాలు.. ఇళ్లు, భవనాలు జలమయం.. ప్రభుత్వం అలర్ట్​.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు - వరదలకు నాగ్​పుర్ అతలాకుతలం

Nagpur Floods Today : మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నగరం నీటిగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వరద తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు.. ప్రజలకు సూచించారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 1:15 PM IST

నాగ్​పుర్​లో వరద బీభత్సం

Nagpur Floods Today : మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నగరం నీట మునిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంబజారి సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. వరద పరిస్థితి తీవ్రంగా ఉండడం వల్ల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. వరదల్లో చిక్కుకుపోయిన 180 మందిని ఇప్పటివరకు రక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

వరదల్లో చిక్కుకున్న వాహనాలు

Nagpur Rain Forecast :నాగ్‌పుర్‌ నగరంలోని లోతట్టు కాలనీలన్నీ నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. వరదనీరు ప్రవేశించిన ఇళ్లలో కేంద్ర బలగాలు పరిశీలించాయి. బస్‌ డిపోను వరదనీరు ముంచెత్తింది. బస్సుల సగం వరకు వరదనీరు నిలిచింది. రోడ్లపై పెద్దఎత్తున వరదనీరు నిలిచిపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వరద పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. నాగ్​పుర్​ నగరంలో వరదల్లో చిక్కుకున్న 40 మంది బధిరులతో సహా 180 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. బధిర విద్యార్థుల పాఠశాల వరదల్లో చిక్కుకోవడం వల్ల రెస్క్యూ దళాలు అప్రమత్తమై వారిని రక్షించాయని అన్నారు. మరోవైపు.. వరద సహాయక చర్యల కోసం ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ దళాలు రంగంలో దిగాయని ఫడణవీస్ తెలిపారు.

వరదల్లో చిక్కుకున్న వాహనాలు

మరోవైపు.. పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. నాగ్‌పుర్, భండారా, గోండియా, వార్ధా, చంద్రపుర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అమరావతి, యవత్మాల్, గడ్చిరోలిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన దృష్ట్యా అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు.. ప్రజలకు సూచించారు.

నాాగ్​పుర్​లో వరదలు
నాాగ్​పుర్​లో భారీగా వరదలు

ABOUT THE AUTHOR

...view details