నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు నెఫ్యూ రియో. ఆయనతో పాటు పలువురు మంత్రులను కూడా ప్రమాణం చేయించారు గవర్నర్ లా గణేశన్. టీఆర్ జెలియాంగ్, వై పట్టోన్ ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. సోషల్ మీడియాలో పాపులరైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెమ్జెన్ ఇమ్నాతో పాటు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరు మహిళ్లలో ఒకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని కొహిమాలో జరిగిన ఈ కార్యాక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)- నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) కూటమి మరోసారి గెలిచింది. 60 స్థానాలున్న నాగాలాండ్‌లో ఈ కూటమి 37 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఆధిక్యాన్ని అధికార కూటమి దక్కించుకుంది. అంతకుముందు 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు బీజేపీ 12, ఎన్డీపీపీ 18 స్థానాల్లో విజయం సాధించగా.. ఈ రెండు పార్టీలు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
చరిత్రలో తొలిసారిగా మహిళ ఎమ్మెల్యేలు
60 ఏళ్ల నాగాలాండ్ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 56 ఏళ్ల సల్హౌతునొ క్రుసో, 48 ఏళ్ల హెకానీ జఖాలు విజయం సాధించి చరిత్రకెక్కారు.