Meghalaya Election 2023 : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ స్థానాల చొప్పున ఉన్నాయి. కాగా మేఘాలయలో ఓ అభ్యర్థి మరణించగా.. నాగాలాండ్‌లో ఓ నియోజకవర్గం ఏకగ్రీవమైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.
ఓటేసిన ముఖ్యమంత్రులు
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గారో హిల్స్‌లోని తురా పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫుయో రియో సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొహిమాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అంతకుముందు మేఘాలయ, నాగాలాండ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవ్వాలని ఆయన ఆకాంక్షించారు. మేఘాలయలో ఉదయం 9 గంటలకు 12 శాతం నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. నాగాలాండ్‌లో 15.76 శాతం నమోదైందని తెలిపింది.
మేఘాలయలో అన్ని పార్టీల నుంచి 369 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 21 లక్షల మంది ఓటర్ల కోసం 3,419 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది.