తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేఘాలయ, నాగాలాండ్​లో ప్రశాంతంగా పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు - meghalaya voting turn out

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేసేందుకు ముందుకొచ్చారు. పలు పోలింగ్ బూత్​లలో ఈవీఎంలు మొరాయించగా.. వాటిని వెంటనే మార్చేశారు.

nagaland meghalaya assembly election
nagaland meghalaya assembly election

By

Published : Feb 27, 2023, 4:03 PM IST

Updated : Feb 27, 2023, 10:40 PM IST

నాగాలాండ్, మేఘాలయలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. నాగాలాండ్​లో 83.63 శాతం మంది ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మేఘాలయలో సాయంత్రం 5 గంటల వరకు 75 శాతం మంది ఓటేశారు. చిన్న చిన్న హింసాత్మక ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించారు. ఆ లోపు లైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఉదయం 11.45 గంటలకు తన సొంత గ్రామమైన ఉత్తర అంగామీ-2 నియోజకవర్గంలోని టౌఫేమాలో ఓటు వేశారు. ఏడోసారి ఈ నియోజకవర్గం పోటీ చేస్తున్న ఆయన.. తన భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్​డీపీపీ- భాజపా కూటమి తప్పక అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నాగాలాండ్ ఓటర్లు

నాగాలాండ్​లో మొత్తం 60 స్థానాలు ఉండగా.. జున్​హెబోటో జిల్లాలోని అకులుటో నియోజకవర్గం ఏకగ్రీవమైంది. దీంతో 59 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 183 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ- బీజేపీ కూటమి మరోసారి అసెంబ్లీలో మెజార్టీ సాధించాలని భావిస్తున్నాయి. 40:20 నిష్పత్తిలో రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్ 21 సీట్లలో బరిలో ఉంది. 19 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు.

నాగాలాండ్​లో పోటెత్తిన ఓటర్లు

'అంతా ప్రశాంతం'
మేఘాలయలోనూ ఓ అసెంబ్లీ సీటు ఏకగ్రీవం కాగా.. 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలు ఉత్సాహంగా ఓటేసేందుకు తరలి వచ్చారని అధికారులు తెలిపారు. అవాంఛనీయ ఘటనలేవీ జరగలేదని చెప్పారు. 'కొన్ని పోలింగ్ బూత్​లలో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే వాటిని పోలింగ్ సిబ్బంది మార్చేశారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది' అని పోలింగ్ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎఫ్ఆర్ ఖార్​కోన్​గోర్ తెలిపారు.

ఈవీఎంలతో పోలింగ్ సిబ్బంది

59 స్థానాలకు 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 36 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 10 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. అధికార కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, భాజపా వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం బరిలో ఉన్నాయి.

మేఘాలయలో ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్
మేఘాలయాలో ఎన్నికల నిర్వహణ
లైన్​లో ఓటర్లు
Last Updated : Feb 27, 2023, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details