Nagaland firing incident today: నాగాలాండ్ మోన్ జిల్లాలో బలగాల కాల్పుల్లో పౌరులు చనిపోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ ఘటనపై కేంద్రం నిజమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత ప్రాంతంలోనే పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు హోంశాఖ ఏం చేస్తోందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
" ఈ ఘటన హృదయవిదారకం. భారత ప్రభుత్వం నిజమైన సమధానం ఇవ్వాలి. సొంత ప్రాంతంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది? "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
సమగ్ర విచారణ చేపట్టాలి: మమతా బెనర్జీ
నాగాలాండ్‌లో బలగాల కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 'బాధాకరమైన వార్త. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. సంఘటనపై సమగ్ర విచారణకు, బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వాలి. 'అని పేర్కొన్నారు మమత .
ఇదీ జరిగింది..
Misfire on Civilians: బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్నారు. అయితే, మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ పరిణామంతో జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాల వాహనాలను తగులబెట్టారు. బలగాల పొరపాటు వల్లే ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు జరిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:Misfire on Civilians: బలగాల తప్పిదం.. 11 మంది పౌరులు మృతి!