Nagaland Army killings:నాగాలాండ్‌లో భద్రతా దళాల చేతిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రక్కులో తిరిగివస్తున్న కూలీలపై కాల్పులు జరిపిన సైన్యం.. ముందస్తుగా వారి గుర్తింపును నిర్ధరించుకునే ప్రయత్నం చేయలేదని తెలిసింది.
Nagaland civilians killed:
DGP report Nagaland civilians killed
కాల్పుల తర్వాత మరణించిన ఆరుగురి శవాలను కూడా దాచిపెట్టేందుకు జవాన్లు ప్రయత్నాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్టు.. రాష్ట్ర డీజీపీ టీ జాన్ లంగ్కుమేర్, కమిషనర్ రోవిలాటో మోర్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ద్వారా వెల్లడైంది. మృతదేహాలను పికప్ ట్రక్కులో ఎక్కించి, ఆర్మీ బేస్‌కు తీసుకెళ్లేందుకు జవాన్లు ప్రయత్నించారని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
"డిసెంబర్ 4న సాయంత్రం 4.10 గంటలకు ఎనిమిది మంది గ్రామస్థులు తిరులోని బొగ్గు గని నుంచి పికప్ ట్రక్కులో తిరిగి వస్తున్నారు. వారిపై భద్రతా దళాలు(21వ పారా స్పెషల్ ఫోర్స్) దాడి చేసి చంపేశాయి. పౌరుల గుర్తింపు నిర్ధరించుకోక ముందే కాల్పులు జరిగాయి. బాధితులంతా నిరాయుధులే. అందులో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తుపాకీ శబ్దాలను విన్న గ్రామస్థులు.. ఘటనా స్థలానికి వెళ్లారు. భద్రతా దళాలు మృతదేహాలను తమ బేస్ క్యాంప్‌కు తీసుకెళ్లేందుకు ఆరు శవాలను చుట్టేసి.. మరో ట్రక్కులో ఎక్కించే ప్రయత్నం చేశారు. శవాలను టార్పాలిన్ షీట్లలో కప్పి ఉంచడాన్ని చూసిన గ్రామస్థులు.. బలగాలతో ఘర్షణకు దిగారు. కోపంతో కొంతమంది గ్రామస్థులు.. బలగాలకు చెందిన మూడు వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘర్షణలో బలగాలు మరోసారి గ్రామస్థులపై కాల్పులు జరిపారు. దీంతో మరో ఏడుగురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేక దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి అసోంవైపు పారిపోయారు. దారిలో బొగ్గు గనుల వద్ద ఉన్న గుడిసెలపైనా కాల్పులు జరిపారు."
-ఘటన జరిగిన తీరుపై నివేదిక
ఉద్రిక్తతలు ఇలా...
మొత్తం 13 మంది పౌరులు మరణించారని నివేదిక స్పష్టం చేసింది. 14 మంది తీవ్రంగా, ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారని తెలిపింది. తీవ్రంగా గాయపడ్డవారిలో ఇద్దరిని బలగాలే అసోంకు తీసుకెళ్లాయని, డిబ్రూగఢ్ బోధనాస్పత్రిలో చేర్పించాయని వివరించింది. అనంతరం అంత్యక్రియల విషయంలో ఉద్రిక్తతలు తలెత్తాయని పేర్కొంది.
"ఆదివారం జరిగిన ఘటన తర్వాత మోన్ పట్టణంలో.. 13మంది మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కోన్యాక్ యూనియన్ (మృతులంతా కోన్యాక్ తెగకు చెందినవారే) ప్రకటించింది. ఓటింగ్ నుంచి వారి మృతదేహాలను తీసుకురాగానే చివరి సంస్కారాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. కానీ, ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. అయితే, వాయిదా గురించి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఈ గందరగోళం వల్ల.. ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొంతమంది ప్రజలు జిల్లా ఆస్పత్రి, కోన్యాక్ యూనియన్ కార్యాలయం వైపు ర్యాలీగా వచ్చారు. కోపంతో కోన్యాక్ యూనియన్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత థామ్నాన్ వార్డులో ఉన్న అసోం రైఫిల్స్ పోస్ట్ వైపు వెళ్లారు. అక్కడి భవనాలపై రాళ్లు రువ్వారు. ఆస్తులను ధ్వంసం చేశారు. మూడు భవనాలకు నిప్పంటించారు. దీంతో అసోం రైఫిల్స్ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ చర్యతో ఆందోళనకారులు మరింత కోపోద్రిక్తులయ్యారు. వీరిని శాంతింపజేయడానికి జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ప్రయత్నించినా... నిరసనకారులు అధిక సంఖ్యలో ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. 600-700 మంది పౌరులు.. కర్రలు, పైపులు, మండే పదార్థాలను తమ వెంట తీసుకొచ్చారు. కొడవళ్లు, పదునైన ఆయుధాలు సైతం వారి వెంట ఉన్నాయి. గంట సేపు ఘర్షణ తర్వాత అసోం రైఫిల్స్ సిబ్బంది మరోసారి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో నిరసనకారులు తమను తాము రక్షించుకునేందుకు పారిపోయారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత.. ఛి గ్రామానికి చెందిన ఓ నిరసనకారుడు మరణించినట్టు తేలింది. మరో ఆరుగురికి సైతం బులెట్ గాయాలయ్యాయి. అందులో ఓ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సిబ్బంది ఉన్నారు. సిబ్బందిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మోన్ పట్టణంలో సెక్షన్ 144 విధించారు. అయితే, పరిస్థితులు ఆందోళనకరంగానే కొనసాగాయి."
-నివేదిక
నాగాలాండ్ ఘటనపై ఉభయ సభల్లో సోమవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. 'మోన్ పట్టణంలో తిరుగుబాటుదారులు సంచరిస్తున్నట్టు పక్కా సమాచారంతో 21 పారా కమాండో బృందం ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనాన్ని జవాన్లు అడ్డుకున్నారు. అదేశాలిచ్చినా, ఆ వాహనం ఆగలేదు. దీంతో అనుమానం మరింత పెరిగి, జవాన్లు కాల్పులు జరిపారు' అని వివరించారు. అయితే వాహనంలో ఉన్నది తిరుగుబాటుదారులు కాదని, పౌరులను ఆ తర్వాత తెలిసిందని చెప్పారు. జవాన్లే వారిని ఆసుపత్రికి తరలించారని వివరించారు.
ఇదీ చదవండి: