భారతీయ జనతా పార్టీ(భాజపా) ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొంది వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. మరోమారు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందు కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటన చేయనున్నారు.
'రాష్ట్రీయ విస్తృత ప్రవాస్' పేరిట దేశవ్యాప్తంగా 100 రోజుల పాటు పర్యటన చేపట్టనున్నారు నడ్డా. 2024లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రూపొందించేందుకు ఆయా రాష్ట్రాలకు వేర్వేరుగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా 2019లో గెలుపొందని చోట వచ్చే ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే అంశంపై పనిచేయనున్నారు. భాజపా అధ్యక్షుడి పర్యటన ముఖ్య ఉద్దేశం కూడా ఇదే.
ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కావటం, కొత్త భాగస్వామ్యాలపై చర్చించడం సహా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠను పెంచటంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు నడ్డా. అలాగే రాష్ట్రాల్లోని పార్టీ బృందాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. కార్యకర్తల్లో పార్టీ భావజాలాన్ని పెంపొందించటం, భాగస్వామ్య పార్టీల్లోని సీనియర్ నాయకులతో కీలక అంశాలపై చర్చించనున్నారు.
కొవిడ్ జాగ్రత్తలతో..
కొవిడ్-19 వ్యాప్తిని పరిగణనలోకి తీసుకొని, వివిధ రాష్ట్రాల్లో నడ్డా పర్యటన సందర్భంగా సమావేశాలకు 200 మందికిపైగా హాజరు కాకుండా చర్యలు తీసుకోనుంది పార్టీ. అలాగే సమావేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, మాస్క్లు తప్పనిసరి చేయనున్నారు. వేదికపై శాలువాలు, పూల మాలలు వేసే కార్యక్రమాలకు స్వస్తి పలికారు. ప్రతీ అంశాన్ని నమోదు చేయనున్నారు.