తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కీలక అంశాలను వేగంగా విచారించాలంటే ఖాళీలను భర్తీ చేయాలి' - ఎన్​.వి రమణ న్యూస్​

Judicial Infrastructure in India: హైకోర్టుల్లో ఇప్పుడున్న ఖాళీలను వేగంగా భర్తీ చేయడమే కాకుండా, న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. 'భారత్‌లో మేధో సంపత్తి హక్కుల వివాదాల పరిష్కారం' అంశంపై దిల్లీ హైకోర్టు నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు.

NV Ramana news
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

By

Published : Feb 27, 2022, 6:52 AM IST

Judicial Infrastructure in India: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేధో సంపత్తి హక్కుల్లాంటి సంక్లిష్టమైన అంశాలను వేగంగా విచారించి కేసులను పరిష్కరించాలంటే హైకోర్టుల్లో ఇప్పుడున్న ఖాళీలను వేగంగా భర్తీ చేయడమే కాకుండా, న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. 'భారత్‌లో మేధో సంపత్తి హక్కుల వివాదాల పరిష్కారం' అంశంపై దిల్లీ హైకోర్టు నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. న్యాయవ్యవస్థకు కల్పించాల్సిన కనీస సదుపాయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన జరగకుండా కఠినమైన నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రసంగిస్తూ మేధో సంపతి హక్కుల వివాద కేసులను పరిష్కరించే సమయంలో వర్తమానంలో ఉన్న క్లెయిమ్‌లతో పాటు భవిష్యత్తు తరాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం పాటించాలని సూచించారు.

స్వతంత్రంగా భారతీయ న్యాయ వ్యవస్థ

'2016లో మేధో సంపత్తి హక్కులపై జపాన్‌లో జరిగిన సెమినార్‌కు వెళ్లినప్పుడు భారతీయ న్యాయ వ్యవస్థ పెట్టుబడిదారులకు స్నేహపూర్వకంగా ఎలా పనిచేస్తుందో చెప్పాలని అక్కడి పారిశ్రామికవేత్తలు పదేపదే అడిగారు. నేను ప్రపంచ దేశాల్లో ఎక్కడికెళ్లినా అక్కడి నిర్వాహకుల నుంచి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతూ వచ్చాయి. అయితే వారికి నేను ఒక్కటే చెప్పా... భారతీయ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. అన్ని పక్షాలను అది సమానంగా, సమతౌల్యంగా చూస్తుందని స్పష్టం చేశాను' అని జస్టిస్‌ ఎన్‌.వి.తెలిపారు.

మేధో హక్కుల కేసులు హైకోర్టులకు భారమే

'ఇప్పటికే పెండింగ్‌ కేసుల భారాన్ని మోస్తున్న హైకోర్టుల న్యాయ పరిధిలోకి మేధో సంపత్తి హక్కుల అంశాన్ని తెచ్చారు. వర్తమాన సమాజానికి అత్యంత అవసరమైన పరిస్థితులకు తగ్గట్టు స్పందించి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అది అవరోధం కాకూడదు. హైకోర్టుల శక్తిసామర్థ్యాలను పెంచుకోవడానికి ఇదే తగిన తరుణం. అప్పుడే మేధో హక్కుల వివాదాలను సులభంగా విచారించి, పరిష్కరించగలుగుతాం. ఇప్పుడున్న ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడమేకాకుండా, న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మెరుగైన వసతులు కల్పిస్తే మరింత మంది ప్రతిభావంతులను ఇటువైపు ఆకర్షించడానికి వీలవుతుంది' అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు.

మౌలిక వసతుల లేమి దురదృష్టకరం

'న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో దురదృష్టవశాత్తు మనం కనిష్ఠ ప్రాథమిక ప్రమాణాలను కూడా అందుకోలేకపోతున్నాం. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల పర్యవేక్షణ, సమన్వయానికి ఒక వ్యవస్థాగత యంత్రాంగం ఏర్పాటు కోసం భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నిధులు కేటాయిస్తే సరిపోదు. వాటిని గరిష్ఠ స్థాయిలో ఉత్తమంగా ఉపయోగించుకోవడమే అసలైన సవాలు. అందుకు అవసరమైన చట్టబద్ధమైన వ్యవస్థలను కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాను. త్వరలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నా'నని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

వ్యవస్థపై నమ్మకం పెరిగింది: సీతారామన్‌

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ, మేధో సంపత్తి హక్కులను కాపాడేందుకు దేశంలో క్రమబద్ధమైన వ్యవస్థను నెలకొల్పినట్లు తెలిపారు. భారతీయ న్యాయవ్యవస్థ అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ స్థాయి అంశాలనూ పరిష్కరించగలుగుతోందని అభిప్రాయపడ్డారు. 2013-14లో పేటెంట్ల కోసం 4వేల దరఖాస్తులు వస్తే, గత ఏడాది ఆ సంఖ్య 28వేలకు పెరిగిందన్నారు. ఇది వ్యవస్థపై పెరిగిన నమ్మకానికి అద్దంపడుతోందని పేర్కొన్నారు.

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన సీజేఐ

దిల్లీలోని మోడర్న్‌ స్కూల్లో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శనివారం ప్రారంభించారు. బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌కు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బౌలింగ్‌ చేయడంతో టోర్నమెంటు మొదలైంది.

ఇదీ చదవండి:'పార్టీలో ఉండే కౌరవుల లిస్ట్‌ తయారు చేయండి'

219 మందితో ముంబయి చేరిన తొలి విమానం.. విద్యార్థుల హర్షం

ABOUT THE AUTHOR

...view details