Mystery Well: అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. వేలాది గ్యాలన్ల నీటని అమాంతం మింగేస్తోంది తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని 'మాయా బావి'. గ్రామం సమీపంలోని నది ఉప్పొంగి వస్తున్న 50 క్యూసెక్కుల నీటిని వారం రోజులు పాటు బావిలోకి పంపినా నిండలేదు. ఇప్పుడు ఈ మాయా బావి గుట్టు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు పరిశోధకులు. తిసయ్యన్వేలి పట్టణానికి సమీపంలోని అయంకుళం పడుగై గ్రామంలో ఉన్న ఈ మాయా బావిపై మద్రాస్ ఐఐటీ బృందం వివిధ కోణాల్లో పరిశోధనలు చేపట్టింది.
బావి గురించి తెలుసుకున్న తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అప్పవు, జిల్లా కలెక్టర్ విష్ణు రెండు రోజుల క్రితం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్రాస్ ఐఐటీ బృందాన్ని పంపించి పరిశోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ క్రమంలో ప్రొఫెసర్లు వెంకట రమణన్, శ్రీనివాసన్ నేతృత్వంలోని బృందం బావి వద్దకు వెళ్లింది. భారీగా వర్షపు నీరు చేరుతున్నా ఎందుకు నిండటం లేదనే కోణంలో పరిశోధనలు చేపట్టింది. అలాగే బావి గురించి, ఇలా ఎంతకాలం నుంచి జరుగుతుంది అనే విషయాలను స్థానికుల నుంచి సేకరించింది ఐఐటీ బృందం. ఇందులోకి చేరుతున్న నీరు సమీపంలోని బావుల్లోకి వెళ్తుండవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. సమీపంలోని నూతల నీటి నమూనాలను సేకరించింది.