ఉత్తరాఖండ్ హల్ద్వానీ సమీపంలో ఓ ఇంట్లో మంటలు అంటుకుంటున్నాయి. అయితే ఈ మంటలు ఎలా అంటుకున్నాయో తెలియడం లేదు. నవంబరు 8న చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాత నుంచి ఇలా అవుతోందని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. విద్యుత్ శాఖకు ఫోన్ చేసి ఇంటి కరెంట్ కనెక్షన్ను తప్పించినట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా ప్లాస్టిక్ ఎలక్ట్రికల్ బోర్డులు, వైర్లు కాలిపోతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇలా 8 రోజుల నుంచి 15-20 సార్లు ఇల్లంటుకుంటుందని చెప్పారు. విద్యుత్ కనెక్షన్ లేకున్నా కూలర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వస్తున్నాయని అంటున్నారు. ఇలా రోజూ మంటలు అంటుకోవటం, వాటిని ఆర్పడం తప్పడం లేదని చెబుతున్నారు. విద్యుత్ శాఖ సాయంతో ఇంట్లో ఎర్తింగ్ కూడా చేశారు. అయినా ఇంట్లో మంటలు చెలరేగుతున్నాయట. దీంతో ఆ కుటుంబ సభ్యులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పుడు ఈ మిస్టరీ ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీసులు విచారణ చేపట్టారు.