చెట్టు.. చల్లని గాలి ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కర్ణాటకలోని కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో మాత్రం ఓ చెట్టు నుంచి నిరంతరాయంగా వర్షపు జల్లులు కురుస్తున్నాయి. చెట్టు కొమ్మల నుంచి ఎవరో స్ప్రే చేసినట్లు 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీరు పడుతోంది. కొన్ని వారాలుగా ఇలాగే వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ఎండలు మండిపోతున్నా.. వర్షం కురవడం మాత్రం ఆగడం లేదు. దీంతో ఆశ్చర్యపోవడం గ్రామస్థులు వంతైంది.
వర్షం కురుస్తున్న ఈ చెట్టును.. శివుడికి ఇష్టమైన బిల్వ పత్ర వృక్షంగా స్థానికులు చెబుతున్నారు. చెట్టు మీద నుంచి పడే నీటిని పరీక్షించేందుకు ప్రయోగశాలకు కూడా పంపారు. చెట్టుకు 500 మీటర్ల దూరంలో ఉన్న దేవరకాడులో భద్రకాళిదేవి కొలువై ఉంది. అమ్మవారి మహిమ వల్లే.. ఇలా జరుగుతుందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని గ్రామస్థులు ఆలయ పూజారిని అడగ్గా.. ఆయన ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ చెట్టు బిల్వ పత్ర వృక్షాన్ని పోలి ఉందని, అక్కడ శివలింగం లేకుంటే.. జలపాతం ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని రకాలైన చెట్లకు ఇలాంటి లక్షణాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. త్వరలో చెట్టును సందర్శించనున్నట్లు విపత్తు నిర్వహణ అథారిటీ, పర్యావరణ అధికారులు చెప్పారు.