మైసూర్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం సరికొత్త కొవిడ్ టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌కు చెందిన లోర్వెన్ బయోలాజిక్స్ ప్రైవేటు సంస్థతో కలిసి ఈ కిట్‌ను రూపొందించింది. ఇది 90 శాతం కచ్చితత్వంతో పని చేస్తుందని.. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితాన్నిస్తుందని పరిశోధకులు మైసూర్ మాజీ ఉపకులపతి, ఎయిమ్స్ సభ్యుడు కేఎస్ రంగప్ప తెలిపారు. ఈ కిట్ సాయంతో ఇంటి దగ్గరే లాలాజలం, నాసిక, కఫం ద్వారా కరోనా పరీక్ష చేసుకోవచ్చని పేర్కొన్నారు.
"బార్‌కోడ్ స్ట్రిప్‌ను యాప్‌తో అనుసంధానించడం ఈ కిట్‌లోని మరో ప్రత్యేకత. బార్‌కోడ్ స్కాన్ చేసిన వెంటనే రోగి ఆరోగ్య పరిస్థితి (పాజిటివ్ లేదా నెగటివ్) సర్వర్‌లో పొందుపరుస్తుంది. తద్వారా వైద్యులు తక్షణమే బాధితులకు చికిత్స అందించడానికి వీలుంటుంది. ఈ కిట్ తయారీలో మాలిక్యూలర్ బయాలజీ, నానోటెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లోని ఆధునిక సాంకేతికతను ఉపయోగించాం" అని పరిశోధనా బృందం తెలిపింది.