House without foundation: ఏ పని చేసినా బలమైన పునాది కావాలంటారు పెద్దలు. అదే విధంగా దృఢమైన పునాది ఉంటేనే ఇల్లు తరతరాలు నిలుస్తుంది. కానీ, కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శరత్ కుమార్ సరికొత్త, ప్రత్యేకమైన సాంకేతికతను తీసుకొచ్చారు. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా తక్కువ ధరలో, తక్కువ సమయంలో పునాది లేకుండానే ఇంటి నిర్మాణం చేపట్టొచ్చని చెబుతున్నారు. ఈ సాంకేతికతను అడ్వాన్స్డ్ రాపిడ్ కన్‌స్ట్రక్షన్‌గా పేర్కొన్నారు.
శరత్ కుమార్ రెండు సంవత్సరాల పాటు ఓ విదేశీ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. ఈ క్రమంలోనే పునాది లేకుండా ఇంటిని నిర్మించే టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. కొత్త సాంకేతికతతో తొలుత హెచ్డీ కోటే ప్రాంతానికి సమీపంలో ఓ డైరీ భవనాన్ని నిర్మించారు శరత్. విజయవంతంగా దానిని పూర్తి చేశాక మైసూర్‌లోని బండిపాళ్యలో ఓ ఇంటి నిర్మాణం చేపట్టారు. కర్ణాటకలో పునాది లేకుండానే నిర్మించిన తొలి ఇల్లుగా ఇది గుర్తింపు పొందింది.
"సాధారణంగా ఇంటి నిర్మాణం కోసం 5-6 అడుగుల లోతు పునాది తీస్తాం. కానీ, మేము పునాది లేకుండా ఇంటిని నిర్మించేందుకు మూడు పద్ధతులను ఉపయోగించాం. మొదటిది పైల్ ఫౌండేషన్, ఇందులో ట్రాక్టర్ ద్వారా 7 అడుగుల లోతు వరకు రంధ్రం చేసి పిల్లర్‌ను ఏర్పాటు చేస్తాం. రెండోది ప్లింత్ బీమ్, మూడోది స్లాబ్ ఆన్ గ్రేడ్ పద్ధతి."