ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం పయనించే నదీ క్రూయిజ్ షిప్ 'ఎంవీ గంగా విలాస్'.. బిహార్ ఛప్రాలోని నది మధ్యలో సోమవారం చిక్కుకుపోయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై ఐడబ్ల్యూఏఐ ఛైర్మన్ సంజయ్ క్లారిటీ ఇచ్చారు. నదిలో నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల క్రూయిజ్ షిప్ ఒడ్డుకు చేరుకోలేకపోయిందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే నౌక.. పట్నా చేరుకుందని చెప్పారు.
వారణాసి నుంచి ఛప్రా వెళ్లిన క్రూయిజ్ షిప్.. నదిలో నీటిమట్టం తక్కువగా ఉండడం వల్ల ఆగింది. అనంతరం అందులో ఉన్న 32 మంది పర్యటకులను చిన్న మోటర్ బోట్ల ద్వారా.. ఒడ్డుకు చేర్చారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. అనంతరం ఛప్రాలో చిరాండ్ పురావస్తు ప్రదేశాలను పర్యటకులు తిలకించారు. మళ్లీ ఆ చిన్న బోట్లలోనే క్రూయిజ్ షిప్‌కు టూరిస్ట్‌లు చేరుకున్నారు. అంతకుముందుకు ఒడ్డుకు చేరుకున్న పర్యటకులకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. డప్పులు వాయిస్తూ.. పూలమాలు వేసి వెల్కమ్ చెప్పారు. ఎంవీ గంగా విలాస్ మొదటి ట్రిప్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది నౌకా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.
గంగా విలాస్ గురించి..
ఎంవీ గంగా విలాస్ నౌకను వారణాసిలోని రవిదాస్ ఘాట్‌లో వర్చువల్ ద్వారా మోదీ జనవరి 13న ప్రారంభించారు. ఈ గంగా విలాస్ నౌక.. భారత్, బంగ్లాదేశ్‌లో 27నదుల గుండా 51 రోజుల్లో 3,200 కిలోమీటర్ల దూరం పయనించనుంది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్ల వంటివి ఇందులో ఉన్నాయి. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ నౌక ప్రయాణ ధరను రూ. 12.59 లక్షలుగా నిర్ధరించారు.