ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కడుపులో నుంచి ఏకంగా 63 స్పూన్లను వెలికితీశారు వైద్యులు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే అతడి కడుపులోకి అన్ని స్పూన్లు ఎలా వెళ్లాయన్న విషయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మన్సూరాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. అతడికి ఆ అలవాటును మాన్పించేందుకు కుటుంబసభ్యులు విజయ్‌ని షామ్లీలోని డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ ఓ నెలరోజుల పాటు చికిత్స పొందాడు. డీఅడిక్షన్ సెంటర్లో ఉన్న విజయ్‌కి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది.