దేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం నాటికి కోటీ 32లక్షలు దాటింది. రోజువారి కేసులు లక్షన్నర దాటాయి. రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు పెరగటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రెండో దశ ఉద్ధృతికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ప్రభుత్వాల ఉదాసీనత, ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి వైరస్ వ్యాప్తికి కారణాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వ్యాక్సినేషన్ మొదలయ్యాక కొవిడ్ నిబంధనలు పాటించే విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. టీకా తీసుకున్నవారు తమకు కరోనా రాదనే ధీమాతో నిబంధనలను పట్టించుకోకపోవటం కూడా మరో కారణమన్నారు. ఈ తరహా వ్యవహారశైలి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంటున్నారు.
గతంలో కంటే వేగంగా..
దేశంలో కరోనా మహమ్మారి ఉత్పరివర్తనం చెంది గతంలో కంటే వ్యాప్తి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలి దశ కంటే రెండో దశ కరోనా వ్యాప్తి రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన కొవిడ్ ఉత్పరివర్తనాలు కూడా కేసుల ఉద్ధృతికి దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పంజాబ్‌లోని 80శాతం, మహారాష్ట్రలో 15 నుంచి 20శాతం కేసులకు బ్రిటన్ స్ట్రెయిన్ కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రస్తుతం దేశంలో బ్రిటన్ స్ట్రెయిన్‌తోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వైరస్ కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిలో యూకే వేరియంట్ అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ వైరస్ వ్యాప్తి సామర్థ్యం మిగితా వాటి కంటే 50శాతం అధికంగా ఉందని పరిశోధకులు తెలిపారు.
తెరవడం వల్లే..
లాక్‌డౌన్ అనంతరం సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయకుండా ఒక్కసారిగా దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, పాఠశాలలు తెరవడం కూడా కరోనా విజృంభణకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలతోపాటు ప్రభుత్వాలు కూడా వైరస్‌ను తేలిగ్గా తీసుకున్నట్లు వివరించారు. ఎన్నికల వేళ ఏ పార్టీకి కరోనా నిబంధనలు పట్టకపోవడం, ప్రచార సభలకు భారీ జనసమీకరణతో కరోనా కోరలు వాడిగా మారినట్లు చెప్పారు.