హిందూ ముస్లిం భాయిభాయి అనేందుకు నిదర్శనంగా దేశమంతటా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి. చాలాచోట్ల హిందూ పండుగలను ముస్లింలు జరుపుకోవడం.. ముస్లిం పండుగలను హిందువులు ఆదరించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఓ ఆసక్తికరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో జరిగింది.
వారణాసిలోని గణేశ్‌పూర్ రుద్రబిహార్ కాలనీకి చెందిన నూర్ ఫాతిమా వృత్తిపరంగా అడ్వొకేట్. ముస్లిం అయినప్పటికి ఆమె శివభక్తురాలు. 2004లో ఆమె తను ఉండే కాలనీలో శివాలయాన్ని కట్టించారు. స్థానికులు ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ఆ గుడి చిన్నగా ఉన్నందువల్ల అక్కడ కూర్చుని భజన చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు.
ఇది చూసిన నూర్ వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దీంతో ఆలయం ముందు ఓ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు అందరూ అక్కడ కూర్చుని భజనలు చేస్తున్నారు. తమ కోసం నూర్ ఈ ఆడిటోరియం నిర్మించినందుకు కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తాను శివుని దర్శనం చేసుకుని వెళ్తానని నూర్ చెబుతున్నారు. దీని వల్ల తనకు అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని చెప్పుకొచ్చారు.