కేరళకు చెందిన జాస్న సలీం అనే మహిళ.. తన ప్రతిభతో అందరి మనసులను దోచుకుంటున్నారు. చూడచక్కని కృష్ణుడి బొమ్మలను గీసి.. సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ తనదైన గుర్తింపును దక్కించుకున్నారు. తాజాగా 101 చిన్నికృష్ణుడి చిత్రపటాలను కేరళలోని గురువాయుర్ దేవాలయానికి దానం చేశారు. త్రిస్సూర్ జిల్లాకు చెందిన జాస్న సలీం.. ఎలాంటి శిక్షణ లేకుండానే కుంచె పట్టి పెయింటింగ్స్ వేస్తున్నారు.
కుంచెతో చిన్ని కృష్ణయ్యకు జీవం.. ఆలయాలకు పెయింటింగ్స్ కానుకగా ఇచ్చిన ముస్లిం - కేరళ ముస్లిం మహిళ కృష్ణుడి పెయింటింగ్స్ న్యూస్
కేరళకు చెందిన ఓ ముస్లిం మహిళ వందలాది పెయింటింగ్స్ వేస్తూ.. దేవాలయాలకు అందిస్తున్నారు. తాజాగా మరో 101 పెయింటింగ్స్ వేసి గురువాయుర్ శ్రీకృష్ణుడి దేవాలయానికి న్యూ ఇయర్ సందర్భంగా సమర్పించారు.
ఆమె గీసిన బొమ్మలన్నీ వెన్న తింటున్న కన్నయ్య చిత్రాలే కావడం విశేషం. వేరే పేయింటింగ్స్ ఎన్నిసార్లు ప్రయత్నించినా అవి సరిగా వచ్చేవి కాదు. ఆమె పెయింటింగ్స్ ఇంట్లో ఉంటే కోరికలు నెరవేరుతాయని స్థానిక ప్రజలు విశ్వసిస్తుంటారు. ముస్లిం వర్గానికి చెందిన జాస్న.. శ్రీకృష్ణుడి బొమ్మలు గీయడం వల్ల చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తన భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పెయింటింగ్‌లో ముందుకు సాగుతున్నారు. చిన్నికృష్ణుడి చిత్రంతో మొదలు పెట్టిన ఆమె ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా పెయింటింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు.
శ్రీకృష్ణుడి పెయింటింగ్స్ వేస్తూ భక్తి పెంచుకున్న జాస్నకు.. గర్భగుడిలోకి వెళ్లి దేవుడిని దర్శించుకునేందుకు పలు ఆలయ అధికారులు అనుమతి ఇచ్చారు. గతంలో తాను వేసిన 500 పెయింటింగ్స్‌ను గురువాయుర్ దేవాలయానికి సమర్పించారు. తాజాగా మరో 101 కన్నయ్య చిత్రపటాలను.. న్యూఇయర్ సందర్భంగా గురువాయుర్ దేవాలయానికి అప్పగించారు. వీటిలో కొన్ని పెయింటింగ్స్‌ను ఆలయంలో ప్రదర్శించారు అధికారులు. ఈ పెయింటింగ్స్ వేసేందుకు నాలుగు నెలల సమయం పట్టిందని జాస్న చెబుతున్నారు. చిన్న ఫ్రేమ్డ్ చిత్రాల నుంచి ఒక మనిషి పరిమాణమంత ఉండే పెయింటింగ్స్ వరకు అందులో ఉన్నాయని తెలిపారు.