Muslim Takes Elders Devotional Tour On Diwali :ఆశ్రమాలలో ఉంటున్న వృద్ధుల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపుతున్నారు గుజరాత్‌కు చెందిన ఓ ముస్లిం. పిల్లలకు దూరంగా ఉంటున్న వృద్ధులను.. పండగ సందర్భంగా ఆధ్యాత్మిక టూర్‌కు తీసుకెళ్తున్నారు. తాజాగా, ఐదు వృద్ధాశ్రమాలకు చెందిన 80 మందిని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లారు జునాగఢ్‌కు చెందిన రియాజ్ రంగూన్వాలా.
వృద్ధులను తీసుకెళ్లడానికి రెండు బస్సులను ఏర్పాటు చేశారు. వీటిని రాధా మీరా బస్సు సర్వీస్ మేనేజర్ ఉచితంగా అందించారు. ఆ వృద్ధులకు భోజన సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేశారు రంగూన్వాలా. వారందరినీ జునాగఢ్ పట్టణం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పురాతన దైవాలయాలు, పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లారు.
"జునాగఢ్ ప్రాంతంలోని వృద్ధాశ్రమాల్లో ఉన్న వారిని పండుగ రోజున దైవదర్శనానికి తీసుకెళ్లాను. అందుకోసం బస్సులో ముందుగా భవన్నాథ్ ఆలయానికి వెళ్లాం. తరవాత అక్షర్ మందిర్, ఇంద్రేశ్వర్ మందిర్‌కు తీసుకెళ్లి సంతోషంగా దైవదర్శనం చేసుకున్నాం. ఆ తరవాత ఐస్‌క్రీమ్ పార్లర్‌కు తీసుకెళ్లి అందరం ఐస్‌క్రీమ్ తింటూ పండుగను చేసుకున్నాం. ప్రజలందరూ కూడా తమ పరివారంతో కలిసి సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటున్నా."
-రియాజ్ రంగూన్వాలా