తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ముస్లింల భారీ ప్రదర్శనలు.. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు

Muslims Protest: దేశవ్యాప్తంగా ముస్లింలు భారీ ప్రదర్శనలు చేపట్టారు. మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ అరెస్టుకు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోనూ భారీ ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కొన్నిచోట్ల కర్ఫ్యూ విధించారు.

Muslim protests over remarks on prophet
Muslim protests over remarks on prophet

By

Published : Jun 11, 2022, 3:45 AM IST

Updated : Jun 11, 2022, 6:34 AM IST

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులపైకి అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాంచీలో గాల్లోకి కాల్పులు జరిపిన భద్రతా బలగాలు ఆ తర్వాత నగరంలో కర్ఫ్యూ విధించాయి. పశ్చిమబెంగాల్లోని హావ్‌డాలో నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం కలిగింది. జమ్మూలో అధికారులు కర్ఫ్యూ విధించగా.. కశ్మీర్‌ లోయలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బంద్‌ పాటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో దాడులకు సంబంధించి 130 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక జామా మసీదు వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థన అనంతరం వెలుపలకు వచ్చి ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని, అనంతరం నిరసనకారులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ప్రార్థనల అనంతరం జరిగిన నిరసనలతో తమకు సంబంధంలేదని, నిరసనకారులెవరో తమకు తెలియదని జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుఖారీ పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని హనుమాన్‌ ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. లాఠీఛార్జి చేసి రహదారులపై బైఠాయించిన ఆందోళనకారులను తరిమివేశారు. ఈ సందర్భంగా అల్లరిమూకలు రాళ్లు విసరడంతో కొంత మంది పోలీసులు గాయపడ్డారు. నగరంలో కర్ఫ్యూ విధించారు. ప్రజలు వీధుల్లోకి రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, సహారన్‌పుర్‌, మొరదాబాద్‌, బిజ్నోర్‌, రాంపుర్‌, కాన్పుర్‌, లఖ్‌నవూలలో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని అటాలా ప్రాంతంలో ఆందోళనకారులు ప్రదర్శన సమయంలో రాళ్లు విసిరారు. కొన్ని బైక్‌లకు నిప్పంటించారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. సహారన్‌పుర్‌, బిజ్నోర్‌, రాంపుర్‌, లఖ్‌నవూల్లోనూ రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆరు జిల్లాల్లో శుక్రవారం రాత్రి వరకు 130 మందిని అరెస్టు చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు.

పశ్చిమబెంగాల్లోని హావ్‌డా జిల్లాలో నిరసనకారులు రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హావ్‌డా-ఖరగ్‌పుర్‌ సెక్షన్‌లో రైలు సర్వీసులూ నిలిచిపోయాయి. పలు చోట్ల ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వాహనాలను ధ్వంసం చేశారు. భాజపా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇంటర్నెట్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. జమ్మూకశ్మీర్‌లోని దోడా, భద్రవాహ్‌, కిస్త్వార్‌లోని కొన్ని ప్రాంతాలలో అధికారులు ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌, బటమాలు, తెంగపొర ప్రాంతాల్లో స్థానికులు పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ బయటకు వచ్చి రాళ్లు విసిరారు.

గుజరాత్‌, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లోని పలు నగరాల్లోనూ మసీదుల్లో ప్రార్థనల అనంతరం నిరసన ప్రదర్శనలు జరిగాయి. కర్ణాటకలోని బెళగావిలో నిరసనకారులు నుపుర్‌ శర్మ దిష్టిబొమ్మను విద్యుత్‌ తీగలతో వేలాడతీయగా పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది దానిని తొలగించారు. మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ నేతలు నుపుర్‌శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌పై గువాహతిలో పోలీసులకు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

బాలలతో ర్యాలీల నిర్వహణపై చిన్నారుల హక్కుల కమిషన్‌ అభ్యంతరం: హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నిరసన ప్రదర్శనలకు చిన్నారులను తరలించుకురావడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) ఛైర్మన్‌ ప్రియాంక్‌ కనూన్గో తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ట్వీట్‌ చేశారు. ఆందోళనల్లో ఎక్కడెక్కడ చిన్నారులు పాల్గొన్నారో వివరాలను తెప్పించుకుని నోటీసులు జారీ చేస్తామన్నారు.

కోల్‌కతాలో కానిస్టేబుల్‌ దుశ్చర్య: కోల్‌కతాలో ముస్లింల భారీ నిరసన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఓ కానిస్టేబుల్‌ తన చేతిలో ఉన్న రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని రౌండ్లు కాల్పులు జరిపిన నిందితుడు ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దక్షిణ కోల్‌కతాలోని పార్క్‌ సర్కస్‌ ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషన్‌ కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు డిప్యూటీ హైకమిషన్‌ వద్ద విధుల్లో ఉన్నాడు. అతను మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ముస్లింల ప్రదర్శనకు, కాల్పుల ఘటనకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు.

హైదరాబాద్‌లోనూ ఆందోళన:మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్‌ మక్కామసీదు వద్ద ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం రోడ్డుపై బైఠాయించారు. నుపుర్‌ శర్మ, జిందాల్‌లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని అజీజియా మసీదులో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా చౌరస్తా వద్ద నిరసనకు దిగారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ రంగనాథ్‌, అదనపు కమిషనర్‌ చౌహాన్‌ మెహిదీపట్నం నిరసనకారులతో మాట్లాడారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. గంటన్నర పాటు ఆందోళన చేపట్టిన నిరసనకారులు.. తర్వాత వెనక్కి తగ్గారు. ర్యాలీకి నాయకత్వం వహించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువకులపై కేసు: ముస్లింలు నిర్వహించిన నిరసన ర్యాలీలో జాతీయ జెండాను అవమానించారని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్‌నగర్‌ సీఐ రాజేశ్వర్‌ గౌడ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నుపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్‌లో నమాజ్‌ అనంతరం ముస్లింలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో గడియారం కూడలి సమీపంలో ఆరీఫ్‌ బిల్లా, మహ్మద్‌ ఇమ్రాన్‌, సయ్యద్‌ నవీద్‌ అనే యువకులు అశోక చక్రం లేకుండా ఉర్దూ పదాలను రాసిన జాతీయ జెండా పట్టుకుని కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేశారు.

వారిపై దేశద్రోహం కేసు పెట్టాలి- బండి:మహబూబ్‌నగర్‌లో జాతీయ పతాకాన్ని అవమానించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌చేశారు. ‘ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. నిందితులపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి’ అని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 11, 2022, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details