దేశవ్యాప్తంగా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్న వేళ జమ్ముకశ్మీర్‌లోని ఓ శివాలయంలో జ్యోతి వెలిగించాడు ఓ ముస్లిం వ్యక్తి. షోపియన్‌లోని తీరథ్ రాజ్ కపల్ మోచన్ దేవగమ్లో గురువారం భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక.. ఆలయంలో దీపాలు వెలిగించాడు గులాం ఖాదిర్ షేక్. ఆ గుడి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు.
పర్యాటక శాఖ కొన్నేళ్ల క్రితం తనను రెండు నెలలపాటు ఆలయ పరిరక్షణ చూసుకోవాలని, అందుకు కొంత మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించిందని ఖాదిర్ చెప్పారు. అయితే తాను ఆ తర్వాత కూడా గుడికి రావడం మానలేదని వివరించారు.
"నాకు ఎవరూ డబ్బులు ఇవ్వకపోయినా.. ఇప్పటికీ ఆలయాన్ని చూసుకుంటున్నా. ఒక కశ్మీరీగా నా పండిట్ సోదరుల పట్ల అది నా బాధ్యత అని భావిస్తాను.హెరాత్ (శివరాత్రి) సందర్భంగా ఈ రోజు కశ్మీరీ పండిట్ భక్తులెవరూ గుడికి రావడం నేను చూడలేదు. అందుకే వచ్చి దీపాలు వెలిగించాను. "
-గులాం ఖాదిర్ షేక్, ఆలయ సంరక్షుడు