Muslim Family Donates to Temple: 'హిందూ- ముస్లిం భాయీభాయీ'..మనదేశంలో సుపరిచితమైన నానుడి. హిందూ- ముస్లిం సఖ్యతను చాటిచెప్పే నినాదం ఇది. దీన్ని నిజం చేస్తూ.. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది బిహార్‌లోని ఓ ముస్లిం కుటుంబం. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఎత్తైన హిందూ దేవాలయ నిర్మాణం బిహార్ తూర్పు చంపారన్ జిల్లా కైథ్వలియాలో జరుగుతోంది. ఈ 'విరాట్ రామాయణ మందిర్' నిర్మాణం కోసం రూ. 2.5 కోట్లు విలువచేసే భూమిని విరాళంగా ఇచ్చిందో ముస్లిం కుటుంబం.
Virat Ramayan Mandir: ఆలయ నిర్మాణానికి ఏదైనా చేయడం తన బాధ్యత అని చెబుతున్నారు వ్యాపారి అయిన ఇష్తియాక్ అహ్మద్ ఖాన్. తనకు, తన కుటుంబానికి చెందిన 23 కట్టా లేదా 71 డిసిమల్స్ భూమిని (0.71 ఎకరాలు) ఆలయానికి ఇచ్చారు. కేసరియా సబ్‌డివిజన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో సంబంధిత ప్రక్రియను పూర్తిచేశారు.
''గ్రామంలో ఎక్కువ భూమి మా కుటుంబానికే ఉంది. అందుకే.. నా బాధ్యతగా ఆలయ నిర్మాణానికి ఏదైనా చేయాలనుకున్నాను. ఇది మాకు సంప్రదాయంగా వస్తోంది.''
- ఇష్తియాక్ అహ్మద్ ఖాన్, దాత
విరాట్ రామాయణ్ మందిర్ ఆలయ నిర్మాణం బాధ్యతను పట్నాకు చెందిన మహవీర్ మందిర్ ట్రస్ట్ చూస్తోంది. 'గువాహటిలో వ్యాపారం చేసే ఖాన్ కుటుంబం.. ఆలయం నిర్మాణం కోసం సాయం చేస్తామని ఎప్పటినుంచో చెబుతోందని' అని పేర్కొన్నారు ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య కిశోర్ కునాల్. ప్రధాన రహదారిపై ఉన్న భూమిని కూడా సబ్సిడీ ధరకు ఇచ్చారని తెలిపారు. అహ్మద్ ఖాన్‌ను ఆదర్శంగా తీసుకొని.. భూమిని ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని, ఇప్పటివరకు మొత్తం 100 ఎకరాల భూమిని సేకరించినట్లు వివరించారు.
''ఖాన్ కుటుంబం.. మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ముస్లింల సాయం లేకుంటే.. అసలు ఈ కలల ప్రాజెక్ట్ సాకారం అవ్వడం కష్టం.''