Musical staircase in metro: మెట్లెక్కితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. అయినా సరే... మనలో చాలా మంది ఎలాంటి సమయంలోనైనా లిఫ్ట్, ఎస్కలేటర్లు వంటి వాటిని వినియోగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఫలితంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో.. ప్రజలను ఆరోగ్యం దిశగా నడిపించేందుకు కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్(కేఎంఆర్ఎల్) అధికారులు వినూత్నంగా ఆలోచించి.. 'మ్యూజికల్ స్టెయిర్ కేస్' పరిష్కారాన్ని కనుగొన్నారు.
Music from stairs: ఎర్నాకుళంలోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్లో ఈ 'మ్యూజికల్ స్టెయిర్‌కేస్'ను అధికారులు ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మెట్లపై అడుగు పెడితే చాలు అందంగా లైట్లు వెలుగుతాయి. పియానో, కీబోర్డు నుంచి వచ్చే సంగీత ధ్వనులూ వినిపిస్తాయి. 'ఆనందంతో ఆరోగ్యం' అనే సందేశాన్ని ఇచ్చేందుకు మెట్రో అధికారులు ఈ సంగీత మెట్లను తీర్చిదిద్దారు.
Kerala metro music: ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్‌లోని ఈ ప్రత్యేకత గురించి తెలియని ప్రయాణికులు.. ఈ మెట్లపై అడుగుపెట్టగానే.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆ తర్వాత ఇందులోని మ్యూజిక్ మ్యాజిక్ గురించి తెలుసుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెట్లపై నడిచేటప్పుడు ప్రయాణికులు మోముపై చిరునవ్వు కనిపిస్తోందని... అదే తమ ప్రాజెక్టుకు దక్కిన విజయానికి సంకేతం అని అధికారులు చెబుతున్నారు.
మెట్రో అధికారుల కృషిపై ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు సంగీత రాగాలు వినిపిస్తూ ఉండడం వల్ల తాము ఒత్తిడిని మర్చిపోతున్నామని చెబుతున్నారు. విదేశాల్లో ఉండే ఈ తరహా సౌకర్యాలు తమ ప్రాంతాల్లోనూ లభిస్తున్నందున వారు మురిసిపోతున్నారు.
"మెట్లపై అడుగుపెట్టినప్పుడు సంగీతం వినిపిస్తోంది. ఇది చాలా సూపర్‌గా ఉంది. దీన్ని మేం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది."
-ప్రయాణికురాలు.