బిహార్లోని మాధేపురా జిల్లాలో దారుణం జరిగింది. భార్యాకూతుళ్లను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఆపై భార్య తలను తీసుకెళ్లి.. తన అత్తవారి ఊరి కల్వర్టు మీద విడిచిపెట్టి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని పోఖారియా తోలా గ్రామానికి చెందిన మహ్మద్ జిబ్రీల్ ఆలం.. భార్య ముర్షిదా, మూడేళ్ల కుమార్తె జియా పర్వీన్లను కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా భార్య తలను తీసుకుని తన అత్తమామల గ్రామమైన గోధెలా కల్వర్టుపై వదిలిపెట్టి పారిపోయాడు. శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చిన ప్రజలు.. మొండెం లేని తలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. జిబ్రీల్ నివాసానికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న జిబ్రీల్ భార్యాకుమార్తెల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న ఓ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈలోపల ఘటన గురించి తెలుసుకున్న వేలాది మంది ప్రజలు జిబ్రీల్ నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులు.. జిబ్రీల్ సవతి తల్లి, అతడి సోదరుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.