తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జడ్జి హత్యపై దుమారం- అసలు కారణాలేంటి? - ధన్​బాద్​ న్యూస్​

ఝార్ఖండ్‌లో జిల్లా అదనపు న్యాయమూర్తి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యాయ వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనపై.. ఝార్ఖండ్‌ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. జడ్జి హత్యకు అసలు కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

murder of Addl Dist Judge
ఆటోతో ఢీకొట్టి జడ్జి హత్య

By

Published : Jul 29, 2021, 5:05 PM IST

జడ్జిని ఆటోతో ఢీకొట్టిన దృశ్యాలు

ఝార్ఖండ్​, ధన్​బాద్​ జిల్లా అదనపు న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్​ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆటోతో ఢీకొట్టి హత్య చేయటం సంచలనంగా మారింది. ఈ కేసు వెనుక ఉన్న కారణాలేంటి? పోలీసులు ఏం చెబుతున్నారు?

ఇదీ జరిగింది..

బుధవారం తెల్లవారుజామున వాకింగ్​కు వెళ్లిన న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్.. దుండగులు ఆటోతో వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్​తో పాటు అతడి అనుచరుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్​ అయిన దృశ్యాలను చూస్తే ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు యత్నించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

అదే కారణమా?

న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్​.. ధన్​బాద్​లో అనేక మాఫియా హత్య కేసులను విచారించారు. ఇటీవల బొగ్గు మాఫియాకు సంబంధించిన రంజయ్​ సింగ్​ మర్డర్​ కేసును విచారించారు. ఈ కేసులో నిందితులైన అభినవ్​ సింగ్​, రవి ఠాకూర్​ ఇటీవల బెయిల్​ కోసం చేసుకున్న దరఖాస్తును న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పథకం ప్రకారమే.. ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఆటో యజమాని ఏం అన్నాడంటే..

హత్య కోసం ఉపయోగించిన ఆటో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కనిపించకుండా పోయినట్లు దాని యజమాని రామ్​దేవ్​ లోహర్​ తెలిపారు. ' నా ఇంటి దగ్గర నిలిపిన ఆటో పోయినట్లు తెల్లవారుజామున 3.30 గంటలకు గుర్తించాను. పోలీసులకు ఫిర్యాదు చేశాను. రాత్రి 8 గంటలకు నన్ను పోలీస్​ స్టేషన్​కు పిలిచారు.' అని చెప్పారు లోహర్​.

సిట్​ ఏర్పాటు..

ఈ ఘటనపై ఇండియన్​ పీనల్ కోడ్​ సెక్షన్​ 302 కింద కేసు నమోదు చేసినట్లు ఐజీ అమోల్​ వినుకాంత్​ హోంకార్​ తెలిపారు. ధన్​బాద్​ నగర ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​)ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ దర్యాప్తులో సీఐడీ, ఎఫ్​ఎస్​ఏల్​ బృందాలు సైతం వారికి సాయం చేస్తాయన్నారు. ధన్​బాద్​ సీనియర్​ ఎస్పీ, డీఐజీ బొకారో పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

" దర్యాప్తులో తేలిన అంశాలు, సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా ఇద్దరు వ్యక్తులు, ఓ ఆటో ఈ నేరంలో ప్రధాన అంశాలుగా ఉన్నట్లు గుర్తించాం. నిందితులు లఖన్​ కుమార్​ వర్మ, రాహుల్​ వర్మలను అరెస్ట్​ చేసి ఆటోను సీజ్​ చేశాం. వారు నేరాన్ని అంగీకరించారు. మరింత దర్యాప్తు చేసేందుకు ఏడీజీ సంజయ్​ ఆనంద్​ లథ్కార్​ నాయకత్వంలో సిట్​ ఏర్పాటు చేశాం. నిజానిజాలు తెలిన క్రమంలో చర్యలు తీసుకుంటాం. "

- అమోల్​ వినుకాంత్​ హోంకార్​, ఐజీ.

న్యాయవాదులు ఏమన్నారు?

ఈ హత్య వివరాలను అందించాలని పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు చెప్పారు అడ్వకేట్​ జనరల్​ రాజీవ్​ రంజన్​. ఏడీజీ స్థాయి అధికారి సిట్​ బృందానికి నేతృత్వం వహిస్తారని, కేసును కోర్టు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్​ చేసి సిట్​ దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

సుప్రీం కోర్టుకు..

ధన్​బాద్​లో న్యాయమూర్తి హత్య వ్యవహారంపై న్యాయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టాలని కొందరు న్యాయవాదులు ఝార్ఖండ్​ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వెంటనే హైకోర్టు.. సుమోటోగా విచారణ చేపట్టింది. మరోవైపు.. ఈ అంశం సుప్రీం కోర్టులోనూ ప్రస్తావనకు వచ్చింది. సీనియర్​ న్యాయవాది, సుప్రీం కోర్టు బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు వికాస్​ సింగ్​.. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై ఝార్ఖండ్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడినట్లు వెల్లడించిన జస్టిస్​ రమణ.. అక్కడ విచారణ జరుగుతోందని తెలిపారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీం కోర్టు బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు వికాస్​ సింగ్​.

"బుధవారం వైరల్​గా మారిన వీడియోను చూశాను. ఉదయపు నడకకు వెళ్లిన న్యాయాధికారిని ఆటో ఢీ కొట్టింది. ఇందులో న్యాయమూర్తిని ఆటో ఢీ కొడుతున్న దృశ్యాలను ఎవరో చిత్రీకరించారు. ఆ సమయంలో వారు మాట్లాడుకుంటూ జూమ్​ కూడా చేసి మరీ దృశ్యాలను చిత్రీకరించారు. పక్కా ప్రణాళికతో దాడి చేశారు. ఈ ఘటన షాక్​కు గురిచేసింది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రపై జరిగిన దాడి. ఈ అంశంపై ఝార్ఖండ్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాను. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద కూడా ప్రస్తావించాను. ఈ కేసును ఝార్ఖండ్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు చేపట్టారని తెలిపారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేస్తున్నాను. ఈ తరహా ఘటనల్లో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడే ఈ తరహా ఘాతుకం జరుగుతుంది. "

- వికాస్​ సింగ్​, సుప్రీం కోర్టు బార్​ అసోసియోషన్ అధ్యక్షుడు.

ఇదీ చూడండి:అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణలో ఆ ఎంపీపై కేసు

ABOUT THE AUTHOR

...view details