అది మహారాష్ట్ర ముంబయి శివారులోని బోరీవలీ రైల్వేస్టేషన్. అక్కడ ఉన్న ఓ కాలివంతెన ప్రయాణికుల సౌకర్యం కోసం నిర్మించిందే అయినా.. కొందరికి అదే ఆవాసం. చదువుకోవాల్సిన వయసులో సరైన సౌకర్యాలు లేని ఎందరో పిల్లలు.. ఆ వంతెనమీదే ఆటపాటలతో కాలం గడుపుతుంటారు. రోజూ ఎంతో మంది వంతెన మీదుగా నడుస్తున్నా.. ఈ పిల్లల గురించి పెద్దగా పట్టించుకునే వారు లేరు.
ఈ దుస్థితిని గమనించిన ఓ యువతి.. అందరిలా పట్టించుకోకుండా వెళ్లిపోలేదు. పిల్లల భవిష్యత్తుకు భరోసాగా తానున్నానంటూ ముందుకొచ్చారు. ఆ వంతెనపైనే వారికి ఓనమాలు నేర్పిస్తూ.. అండగా నిలుస్తున్నారు. తనే.. జానూన్ ఎన్జీఓ అధ్యక్షురాలు హేమంతి సేన్.
రోజూ హేమంతి ఆ వంతెన వద్దకు చేరుకుంటారు. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకొని వారితో అక్షరాలు దిద్దిస్తారు. కాలివంతెనలే దిక్కుగా బతుకుతున్న పిల్లలకు మూడేళ్లుగా ఇలా చదువు చెప్పడం సహా వారి ఆలనాపాలనా చూస్తున్నారు హేమంతి సేన్.