భారీ వర్షాలు ముంబయి నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. ఇళ్లపై కొండచరియలు విరిగిపడగా.. పైకప్పులు, గోడలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఇళ్లలో నివసిస్తున్న 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న 19 మందిని కాపాడారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల ధాటికి విఖ్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. శిథిలాల్లో మరో ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సబర్బన్ భండప్‌లో అటవీ విభాగానికి చెందిన గోడ కూలి ఓ బాలుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
స్తంభించిన జనజీవనం..
ముంబయిలోని బోరివలీలో వరదల ధాటికి పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరగా ప్రజలు అవస్థలు పడ్డారు. జోరు వానలకు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సోమవారం కూడా ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఇదివరకు జారీ చేసిన గ్రీన్ అలర్ట్‌ను రెడ్ అలర్ట్‌గా మార్చింది. ముంబయిలో కేవలం 6 గంటల వ్యవధిలోనే 100 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 120 మిల్లిమీటర్ల వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది.
నష్ట పరిహారం..