మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ). బుధవారం రాత్రి ముంబయిలో ఎన్సీబీకి చెందిన పలు బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
మంత్రి అల్లుడు అరెస్ట్..
ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను బుధవారం అరెస్ట్ చేసింది ఎన్సీబీ. ఈ కేసుకు సంబంధించి వారం క్రితం అరెస్టయిన బ్రిటన్ వ్యక్తి కరణ్ సంజ్నాని సహా మరో ఇద్దరితో రూ.20వేల ఆన్లైన్ లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన ఎన్సీబీ ఇప్పటికే తాఖీదులు ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం సమీర్ ఖాన్‌ను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసింది.
చట్టానికి ఎవరూ అతీతులు కాదు..
తన అల్లుడు సమీర్ ఖాన్ అరెస్ట్‌పై స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టం అమలు కావాలన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. న్యాయవ్యస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముచ్చడ్ పాన్‌వాలాను అరెస్ట్ చేసింది ఎన్సీబీ. అలాగే.. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ సోదరి కోమల్ రాంపాల్‌ను గత సోమవారం విచారించింది. అర్జున్ రామ్‌పాల్‌ను సైతం ఈనెల 13న విచారించింది. అదే రోజు ఆయన ప్రేయసి గబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను సుమారు 6 గంటల పాటు ప్రశ్నించింది ఎన్సీబీ.
ఇదీ చూడండి:రూ.4 కోట్లు విలువైన గంజాయి పట్టివేత