మన దేశంలో పాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పాన్ వేసుకుని నవాబుల్లా ఫీల్ అవుతుంటారు చాలామంది. మరి ఈ పాన్ ధర ఎంతుంటుంది? మహా అయితే ఒక 50 రూపాయలు. అయితే.. ముంబయిలో లభించే ఈ ప్రీమియం పాన్ కొనాలంటే నవాబే అయ్యి ఉండాలి ఏమో. ఎందుకంటే దీని ధర రూ.లక్ష రూపాయలు.
మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వదులుకొని..
ముంబయి మాహిమ్ ప్రాంతంలోని 'ది పాన్ స్టోరీ' పేరుతో ఉండే ఈ పాన్‌షాప్ లోకల్‌గా బాగా ఫేమస్. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వదులుకొని ఈ పాన్ షాప్ పెట్టిన నౌషాద్.. అతితక్కువ కాలంలోనే తన వ్యాపారాన్ని లాభాలబాట పట్టించాడు. వివిధ రకాల పాన్లను విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే నౌషాద్.. ఈసారి తాజ్‌మహల్ పాన్‌ను రూపొందించాడు.
ప్రేమకు ప్రతీకైన తాజ్‌మహల్‌కు తన స్పెషల్ పాన్‌ను జోడిస్తే ఆ అనుభూతే వేరు అంటున్నాడు నౌషాద్. దీనిని ఎవరికైనా బహుకరిస్తే ఆ క్షణం వారికి జీవితాంతం గుర్తుండిపోతుందనే నమ్మకంతో ఈ తాజ్‌మహల్ పాన్‌ను తయారు చేసినట్లు తెలిపాడు. ఈ పాన్ కోసం రూ.లక్ష ఖర్చు చేసిన వారు ఆ స్థాయిలోనే అనుభూతిని పొందుతారని చెబుతున్నాడు నౌషాద్.