తల్లి ప్రేమ అన్నింటికంటే గొప్పదని పెద్దలు అంటుంటారు. ఆ మాట సత్యమని రుజువు చేసింది ఈ ఘటన. ఏడాది క్రితం అమ్మ నుంచి వేరైన చిరుత పిల్లను తిరిగి తల్లి వద్దకు చేర్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు అటవీ అధికారులు. ముంబయిలోని సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ వద్ద గుండెను కలచివేసేలా జరిగిన ఈ కలయిక పలుపురి ప్రశంసలు అందుకుంటోంది.
అసలేం జరిగింది: మానవులపై వరుస చిరుత దాడుల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సి33-డెల్టా అనే ఆడ చిరుతను పట్టుకున్నారు. సాధారణంగా ఆడ చిరుతలు మనుషలకు దూరంగా ఉంటాయని.. అలాంటిది ఈ చిరుత వారిపై దాడి చేయడమేంటా అని అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. డెల్టా చిరుతను పట్టుకున్నప్పటికి దాడులు తీవ్రమవ్వడం వల్ల ఇదంతా దీని పని కాదని తెలుసుకున్నారు. తమ తప్పును గ్రహించిన అటవీ సిబ్బంది దాన్ని తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఓ కంట కనిపెట్టేందుకు దాని మెడకు రేడియో కాలర్ సైతం కట్టారు. సీ32 అనే మరో ఆడ చిరుత అధికారులకు చిక్కాక ఈ దాడులు ఆగిపోయాయి. ఇదంతా జరిగి ఏడాదయ్యింది.
సరిగ్గా ఏడాది తర్వాత అక్టోబర్ 10న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వద్ద కుక్కలు అరుస్తున్న శబ్దాన్ని విన్న భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ చిరుత పిల్ల దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. దాన్ని పట్టుకుని అధికారులకు అప్పజెప్పారు. అటవీ అధికారులు ఆ చిరుత పిల్లని వైద్య పరీక్షల నిమిత్తం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అక్టోబర్ 11న పిల్లను తల్లి వద్దకు చేర్చేందుకు సిద్ధమయ్యారు.