Mumbai Hotel Bomb Threat: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇటీవల 26/11 తరహా పేలుళ్లకు పాల్పడుతామంటూ ఓ పాకిస్థాన్ నంబరు నుంచి పోలీసులకు మెసేజ్ వచ్చింది. తాజాగా మరో ఫైవ్ స్టార్ హోటల్‌కు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. హోటల్‌లో బాంబులు అమర్చామని, రూ.5 కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తామంటూ ఆగంతుకులు ఫోన్ చేశారు. అయితే అది నకిలీ బెదిరింపు కాల్ అని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ముంబయిలోని ప్రముఖ లలిత్ హోటల్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి హోటల్‌లో నాలుగు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పారు. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే హోటల్‌ను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా ధ్రువీకరించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.