ముంబయిలో బాంబు పేలుళ్లు జరుగుతాయన్న ఫోన్ కాల్ కలకలం రేపింది. నగరంలోని మూడు ప్రముఖ ప్రదేశాల్లో దీపావళి రోజున బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతాయన్న ఫోన్ కాల్ రాగానే ముంబయి పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు చేశారు.
'దీపావళి నాడు 3 చోట్ల బాంబ్ బ్లాస్ట్‌లు'.. బెదిరింపు కాల్‌తో పోలీసులు హైఅలర్ట్
దీపావళి నాడు నగరంలోని మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ వచ్చిన ఫోన్ కాల్.. ముంబయి పోలీసుల్ని పరుగులు పెట్టించింది. తనిఖీలు చేసిన పోలీసులు.. చివరకు ఇది బూటకపు బెదిరింపు అని తేల్చారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. బాంబే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం రాత్రి 10.30కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీపావళి నాడు అంధేరిలోని ఇన్ఫినిటీ మాల్, జుహూలోని పీవీఆర్, సహారా హోటల్లో బాంబులు పేలుతాయని ఆగంతుకులు చెప్పారు. పోలీసులు ఈ ఫోన్ కాల్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. దుండగులు చెప్పిన మూడు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే.. వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఇది ఫేక్ కాల్ అని నిర్ధరించిన పోలీసులు.. ఈ పని ఎవరు చేశారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.