ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్‌లోని ఓ గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక పుట్టినప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఆమెకు ఇటీవలే సోనోగ్రఫీ పరీక్షలు నిర్వహించిన ముంబయి వైద్యులు ఆ నొప్పికి గల కారణాలను చెప్పగా.. తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె కడుపులో పెరుగుతున్నది గడ్డ కాదని.. తల, కళ్లు, చేతులు, కాళ్లు ఉన్న ఓ మృతశిశువు అని తేల్చారు.
మృతశిశువు..
పుట్టుకతోనే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడే ఆ బాలికతో పాటే కడుపులోని శిశువు సైతం పెరుగుతూ వచ్చిందని వైద్యులు తెలిపారు. బిడ్డ కడుపునొప్పి అని బాధపడినప్పుడల్లా చిన్న చిన్న ఆస్పత్రులతో పాటు.. భూతవైద్యులకు చూపించడం చేసేవారు రోష్ని తల్లిదండ్రులు. చివరకు నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో ముంబయిలోని సియాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
బాలిక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వైద్యులు శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. తీవ్రంగా శ్రమించి.. విజయవంతం అయ్యారు. ఎట్టకేలకు చిన్నారి కడుపులోని మృతశిశువును బయటకు తీశారు. ఇటువంటి అరుదైన సందర్భాల్లో బిడ్డ పుట్టే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తెలిపారు.
ఇక.. ఈ పరిస్థితిని మొదట్లోనే కనుగొనవచ్చని శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ పరాస్ కొఠారి తెలిపారు. 'చిన్నప్పటి నుంచే కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించకుండా.. మూఢనమ్మకాల వల్ల చిన్నారి ప్రాణాలను ప్రమాదంలో నెట్టారని' చెప్పారు.
'ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతమైంది.. బాలిక తన జీవితాన్ని తోటివారిలాగే కొనసాగించగలుగుతుంది' అని డాక్టర్ జోషి స్పష్టం చేశారు. ఉత్తమమైన పీడియాట్రిక్ బృందం వల్లే ఈ ఆపరేషన్ సాధ్యమైందని తెలిపారు.
ఇవీ చదవండి: