Mumbai police: సుమారు రూ.17 లక్షలు విలువ చేసే బంగారం ఉన్న బ్యాగ్ పోయిందన్న ఫిర్యాదు అందిన కొన్ని గంటల వ్యవధిలోనే ముంబయి పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన నాగమ్మ అనే మహిళ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబంతో పాటు ముంబయికి వెళ్లారు. తనతో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లారు. రైలు దిగిన తరువాత బ్యాగ్ మిస్ అయ్యిందని గుర్తించారు. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని సీఎస్‌ఎంటీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బ్యాగ్‌ను గుర్తించి ఆమెకు అందజేశారు.
ఇదీ జరిగింది...!
నాగమ్మ శివలింగి అనే మహిళ తన కుటుంబంతో కలిసి కృష్ణా రైల్వే స్టేషన్ నుంచి ముంబయికి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో గురువారం బయలుదేరారు. శుక్రవారం ఉదయం ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు దిగిన తరువాత తనతో తీసుకుని వెళ్లిన బ్యాగ్‌లు అన్నీ ఉన్నాయా లేదా అని లెక్క పెట్టుకున్నారు. ఒక్క బూడిద రంగు బ్యాగ్ మాత్రం కనిపించలేదు. రైలులోనే సీటు కింద మర్చిపోయినట్లు భావించారు. వెంటనే లోకల్ ట్రైన్లో సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌కు చేరుకుని వారు వచ్చిన ఎస్ 4 బోగీని చూశారు. బ్యాగ్ కనిపించలేదు. ప్రయాణంలో తమ వెనుక కూర్చున్న వారు దొంగలించి ఉంటారని అనుకున్నారు. దీంతో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.