దేశంలో 'పబ్జీ' సమస్యలు మళ్లీ పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి యువత వరకు చాలా మందికి పబ్జీ(pubg mobile india) ఓ వ్యసనంగా మారిపోయింది. ఆ మాయలో పడి.. ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. తాజాగా.. పబ్జీ కోసం ఓ 16ఏళ్ల బాలుడు.. తన తల్లి బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ.10 లక్షలు ఖర్చుపెట్టాడు. విషయం తెలుసుకున్న ఆ తల్లి మందలించేసరికి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
మహారాష్ట్ర ముంబయిలోని జాగేశ్వరి ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాలుడు పబ్జీకి(pubg news today) బానిసైపోయాడు. ఆట కొనసాగాలన్న, ప్లేయర్ల ప్రదర్శన మెరుగ్గా ఉండాలంటే గేమ్‌లో కొన్ని ఫీచర్స్(ఆయుధాలు వంటివి) కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ బాలుడు తల్లి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీశాడు. ఇదేంటని తల్లిందడ్రులు తిట్టేసరికి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగిరానని లేఖ కూడా రాశాడు.
ఈ వ్యవహారాన్ని అంధేరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ఆ 16ఏళ్ల బాలుడు అంధేరీ ఈస్ట్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే అతడ్ని పట్టుకుని, కౌన్సిలింగ్ ఇచ్చి.. తల్లిదండ్రులకు అప్పగించారు.