పంద్రాగస్టు వేడుకల కోసం దిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్రసంగించే ఎర్రకోట వద్ద బహుళ స్థాయి రక్షణ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎన్ఎస్జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, శునకాలను రంగంలోకి దించారు. ఎర్రకోట పరిసరాల్లో ఉన్న ఆకాశహర్మ్యాలపై షార్ప్ షూటర్లను మోహరించారు. జమ్ము విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో ఎర్రకోట వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఇన్స్టాల్ చేశారు.
మొత్తంగా.. ఎర్రకోట వద్ద ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 350 కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని రెండు కంట్రోల్ రూంలలోని పోలీసులు అనుక్షణం పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. 70 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించనున్నట్లు చెప్పారు.
కంటైనర్ల గోడ
తొలిసారి ఎర్రకోట ప్రధాన ప్రవేశద్వారం వద్ద తాత్కాలిక గోడ నిర్మించారు. షిప్పింగ్ కంటైనర్లతో భారీ అడ్డుగోడ ఏర్పాటు చేశారు. వీటిని గ్రాఫిటీతో అందంగా అలంకరించారు. కోటలోని పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతర వ్యక్తులు లోపలికి రాకుండా ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను దృష్టిలో పెట్టుకునే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక నిరసనలు పునరావృతం కాకుండా ఇలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
దిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ భద్రతను పటిష్ఠం చేశారు. యమునా నది చుట్టుపక్కల పోలీసులు ద్విచక్ర వాహనాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు