Mukkanuma Significance: సంక్రాంతి పండగ వచ్చిందంటే.. రంగురంగుల హరివిల్లులతో తీర్చిదిద్దిన లోగిళ్లు, పసుపు కుంకుమలు వేసిన గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, పిండి వంటల ఘుమఘుమలు, ఎటు చూసినా పతంగులు, కొత్త అల్లుళ్లతో సందడి సందడిగా ఉంటుంది. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ ఎన్ని రోజులంటే అందరూ ఏకకంఠంతో చెప్పే మాట మూడు రోజులని. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. సంక్రాంతి మూడు రోజుల పండగ కాదంటా.. నాలుగు రోజులని అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తొలిరోజైన భోగి నాడు.. రోజంతా భోగిమంటలు, చిన్నపిల్లలకు భోగిపళ్లు, బొమ్మల కొలువుతో సందడిగా సాగిపోతుంది. రెండో రోజు మకర సంక్రాంతిని పెద్దల పండగగా భావిస్తారు. మూడో రోజు కనుమ సందర్భంగా పంటలు పండేందుకు తోడ్పాటునిచ్చే పశువులకు కృతజ్ఞత తెలుపుతూ రైతులు పూజలు చేస్తారు. ఇక నాలుగోరోజు ముక్కనుమ. మరి ముక్కనుమ నాడు ఏం చేస్తారంటే..?
మకర సంక్రాంతి ఎప్పుడు? - పండగ ఏ రోజున జరుపుకోవాలి?
ముక్కనుమ:ఈ పండగపై రెండు వివాదాలు ఉన్నాయి. అసలు ముక్కనుమ అనేది శాస్త్రాల్లో లేదని ఒక వాదన ఉంది. ఎవరో తీసుకువచ్చి కనుమకు అతికించారని, ఇది అలా అలా ప్రచారంలోకి వచ్చిందని అంటారు. మరో వాదన ప్రకారం ముక్కనుమ అనేది ఉందని. సో.. ఈ రెండు వివాదాల మధ్య కొన్ని చోట్ల ఈ పండగను జరుపుకుంటే.. మరికొన్ని చోట్ల వదిలేస్తున్నారు. అయితే కనుమ నాడు చాలా మంది నాన్‌వెజ్ వండుకుని తింటుంటారు. కానీ.. వాస్తవానికి నాలుగో రోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని, తమని రక్షించమని వేడుకుని బలిస్తారు. ఈ రోజున నాన్ వెజ్ తింటారు. అందుకే ఈ రోజున ముక్కల కనుమ అంటారు..అదేనండీ ముక్కనుమ.
మరీ ముఖ్యంగా సంక్రాంతిలో మూడో రోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదనే నియమం మేరకు పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు నాలుగో రోజున అత్తారింటికి తిరిగి పయనమవుతారు. అందుకే ముక్కనుమ రోజున నాన్ వెజ్‌తో మంచి భోజనం పెట్టి, పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తారింటికి పంపిస్తారు.