ఆమె మాస్టర్స్ చదువుతోంది. అందరిలా చదువు, తరువాత జాబ్.. ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించింది. చదువును కొనసాగిస్తూ.. ప్రజలతో సాన్నిహిత్యంగా మెలిగే ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంది. బాగా ఆలోచించి ఓ టీ స్టాల్‌ను ప్రారంభించింది. అందరూ తయారుచేసే టీ లా కాకుండా.. కొత్త విధానంలో ఛాయ్ తయారు చేస్తూ యువతను బాగా ఆకట్టుకుంటోంది.
గత కొద్దికాలంగా దిల్లీలో ముఖర్జీనగర్‌లో ఉన్న జేజే తాడి టీ స్టాల్ యువతతో కళకళలాడుతోంది. దీనికి కారణం ఇక్కడ డిఫరెంట్‌గా తయారుచేసిన టీ ఉండడం. ఛాయ్ తయారీలో ఎవరైనా పాలు, నీరు, టీ పొడి, చక్కెర, యాలకులు వినియోగిస్తారు. కానీ జేజే తాడి టీ స్టాల్‌లో మాత్రం గులాబీ రేకులు, బిర్యానీ ఆకులు, తులసి ఆకులను వాడుతున్నారు. వీటితో తయారు చేసిన టీ రుచిగా ఉండటం వల్ల ఛాయ్ తాగడానికి ప్రజలు తరలివస్తున్నారు.
రాజస్థాన్‌కు చెందిన జ్యోతి జంగీద్ మాస్టర్స్ చదివేందుకు దిల్లీ వచ్చింది. అక్క వాళ్లతో కలిసి ముఖర్జీనగర్‌లో ఉంటోంది. గ్రాడ్యుయేషన్‌ను అక్కడే ఉండి పూర్తి చేసింది. ఆ తర్వాత ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంది. బాగా ఆలోచించి టీ స్టాల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ముఖర్జీనగర్‌లో 'జేజే తాడి' పేరుతో టీ స్టాల్ ప్రారంభించింది. టీ స్టాల్ పేరులో జేజే అంటే జ్యోతి జంగీద్ అని, తాడి అంటే తమ భాషలో కూర్చునే చోటని ఆమె చెబుతోంది.